ధర్మస్థలలో ఏ అకృత్యాలూ జరగలేదు
బనశంకరి: ప్రపంచమంతటా పేరుపొందిన పుణ్య యాత్రాస్థలి ధర్మస్థలం మీద బురదజల్లాలని కొందరు కుట్రదారులు చేసిన ప్రయత్నం నిష్ఫలమైంది. అక్కడ ఎంతోమంది మహిళలు, యువతులపై అత్యాచారాలు, హత్యలు చేశారు, శవాలను నదిలో విసిరేయడంతో పాటు అనేకచోట్ల పూడ్చిపెట్టారని ఓ అపరిచితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి, చివరికి వట్టి కట్టుకథ అని నిర్ధారించారు.
3,923 పేజీల నివేదిక
ఇదంతా డబ్బు, దుష్ప్రచారం కోసం కొందరు చేసిన కుట్ర అని, అక్కడ ఏమీ జరగలేదని నివేదికలో స్పష్టంచేశారు. ఈ మేరకు 3,923 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను బెళ్తంగడి కోర్టుకు సిట్ అధికారులు దాఖలు చేశారు. చిన్నయ్య అబద్ధపు ఫిర్యాదు చేశాడని తమ దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. చిన్నయ్య వాంగ్మూలంతో జూన్ ఆఖరు నుంచి 2 నెలలకు పైగా అనేక ప్రదేశాలలో జేసీబీలు, వందలాది మంది కూలీలు, క్లూస్ టీంలతో ముమ్మర గాలింపు సాగడం తెలిసిందే. కొన్నిచోట్ల ఏవో ఎముకలు తప్ప మృతదేహాల జాడలు లభించలేదు. క్రమంగా చిన్నయ్య, మిగతావారి పన్నాగం అని బయటపడింది.
నివేదికలో ఏముందంటే...
ధర్మస్థల కేసులో మాస్క్ మ్యాన్, మాజీ పారిశుధ్య కార్మికుడు చిన్నయ్య, స్థానిక సామాజిక కార్యకర్తలు మహేశ్‌శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్, విఠల్‌గౌడ, జయంత్, సుజాత భట్ ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నివేదికలో పేర్కొన్నారు. డబ్బుకు ఆశపడి చిన్నయ్య ఎక్కడి నుంచో ఓ పుర్రెను తీసుకొచ్చి ధర్మస్థల మారణకాండకు సాక్ష్యమని ప్రచారం చేశాడని తెలిపారు. చిన్నయ్యను ముందు పెట్టుకుని మిగతావారు కుట్రను అమలుచేశారన్నారు. వందలాది శవాలను పూడ్చి పెట్టినట్లు చిన్నయ్యతో జిల్లా ఎస్పీ, న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చేలా ప్రేరేపించారని చెప్పారు. లైంగిక దాడులు, హత్యలు అనేది అబద్ధమని స్పష్టంచేశారు. కుట్ర కేసులో ఇదివరకే చిన్నయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
బెళ్తంగడి కోర్టులో సిట్ ప్రాథమిక నివేదిక
చిన్నయ్య, ముఠా తప్పుడు ఫిర్యాదు ద్వారా కుట్ర
నివేదికలో వెల్లడి
కోర్టులో విచారణ
సిట్ అధికారులు నవంబరు 21న దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి కోర్టులో నివేదిక అందజేశారు. బుధవారం ఈ కేసును కోర్టు విచారించింది. ధర్మస్థల మీద కుట్రకు పాల్పడిన వారిపై సాక్ష్యాధారాలు ఉన్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ కోరింది. చిన్నయ్యతో కుట్రలో భాగస్వాములైన మిగిలిన ఐదుగురి పేర్లను ప్రస్తావిస్తూ సిట్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నెల 26న ఆదేశాలిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. నివేదికతో ధర్మస్థల భక్తులు, హిందూసంఘాలలో సంతోషం నెలకొంది.
ధర్మస్థలలో ఏ అకృత్యాలూ జరగలేదు


