గోవధ నిషేధ చట్టానికి గండి కొట్టొద్దు
తుమకూరు: గోవులు, పశువుల వధను అడ్డుకునే చట్టానికి సవరణలు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వం నిర్ణయించడంపై విశ్వ హిందూ పరిషత్ గోరక్షా విభాగం కార్యకర్తలు , బీజేపీ నాయకులు బుధవారం నగరంలో ఆందోళన జరిపారు. జీజీఎస్ సర్కిల్‌లో గోవులతో నిరసన తెలిపారు. గోవధను అరికట్టేందుకు గత బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన చట్టాన్ని సవరించి గోవధకు సహకారం, ప్రోత్సాహం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనార్టీల ఓట్ల కోసం వారిని బుజ్జగించేందుకు గోవధ నిషేధ చట్టాన్ని నీరుగార్చడం సరికాదన్నారు. ఈ చట్టాన్ని యథాప్రకారం అమలు చేయాలన్నారు. గోవులకు కార్యకర్తలు పూజలు చేశారు.
ఆన్‌లైన్ గేమ్‌తో
రూ.40.71 లక్షల టోపీ
మైసూరు: ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న స్నేహితుల మాటలను నమ్మిన ఓ వ్యక్తి డబ్బు పెట్టుబడి పెట్టి రూ.40.71 లక్షలను కోల్పోయిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. నగరంలోని అశోక రోడ్డు నివాసి రాజస్థాన్‌కు వెళ్లాడు. అక్కడ వారి స్నేహితులు ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బు పెట్టుబడి పెడితే కోట్లాది రూపాయలను సంపాదించవచ్చని ఆశ పుట్టించారు. మైసూరుకు తిరిగివచ్చాక అతడు గూగుల్‌లో వెతికి ఫన్ ఇన్ మ్యాచ్ అనే యాప్ ద్వారా అక్కడి వ్యక్తిని సంప్రదించి డబ్బు పెట్టుబడి పెట్టారు. మొదట్లో కొద్దిగా లాభం వచ్చింది. దీంతో సంతోషపడిన ఆ వ్యక్తి సైబర్ మోసగాళ్లు చెప్పినట్లుగా దశల వారీగా రూ.40.71 లక్షలను పెట్టుబడి పెట్టగా రూపాయి కూడా తిరిగి రాలేదు. సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
దావణగెరెలో చోరీ..
మధ్యప్రదేశ్‌లో సొత్తు రికవరీ
దొడ్డబళ్లాపురం: దావణగెరెలో పెళ్లిలో చోరీకి గురైన బంగారు ఆభరణాలను దావణగెరె గ్రామీణ పోలీసులు మధ్యప్రదేశ్‌లో సీజ్ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కరుడుగట్టిన దోపిడీ ముఠా అయిన బ్యాండ్ బాజా గ్యాంగ్ సభ్యులు ఈ చోరీకి పాల్పడ్డారు. వివరాలు.. గత నెల 14న అపూర్వ రెస్టారెంట్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలోకి కరణ్ వర్మ, వినీత్ సిసోడి అనే దొంగలు చొరబడ్డారు. పెళ్లివారు ఓ బ్యాగులో ఉంచిన 535 గ్రాముల బంగారు నగలను దోచుకుని మధ్యప్రదేశ్‌కి పరారయ్యారు. పోలీసులు మధ్యప్రదేశ్‌లోని రాజగడ్ జిల్లా నరసింగలో కార్యాచరణ జరిపి దొంగలను గుర్తించారు. వారి ఇళ్లలో నుంచి రూ.51.49 లక్షల విలువైన బంగారు సొత్తును సీజ్ చేశారు. అయితే దొంగలు పట్టుబడలేదు. వారి కోసం శోధిస్తున్నారు.
చనిపోయినా వదలడం లేదు
● రేణుకాస్వామి సమాధి ధ్వంసం
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పెద్ద సంచలనం సృష్టించిన కేసు చిత్రదుర్గంవాసి రేణుకాస్వామి హత్య. గతేడాది జూన్ 8న రాత్రి బెంగళూరులో కామాక్షిపాళ్య పీఎస్ పరిధిలో పట్టణగెరెలో ఓ షెడ్డులో అతనిని తీవ్రంగా చితకబాది హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా నటి పవిత్రగౌడ, నటుడు దర్శన్, మరికొందరు నిందితులు అప్పటి నుంచి పరప్పన జైలులో ఉండడం తెలిసిందే. అయితే రేణుకాస్వామి మరణించినా కూడా దాష్టీకాలు ఆగడం లేదు. రేణుకాస్వామి సమాధి ఫలకాన్ని ఎవరో దుండగులు ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. చిత్రదుర్గలో అతని సమాధి ఉండగా, పక్కనే లేఔట్ నిర్మిస్తున్న వారు ఈ పనికి పాల్పడ్డారా? లేక మరెవరైనా ధ్వంసం చేశారా? అనేది తెలియడం లేదు. రేణుకాస్వామి భార్య, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇక దర్శన్ నటించిన డెవిల్ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
గోవధ నిషేధ చట్టానికి గండి కొట్టొద్దు


