పెండింగ్ పనుల సత్వర పూర్తికి సూచన
హొసపేటె: జిల్లాలోని 8 స్థానిక సంస్థల పరిధిలోని వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లాధికారిణి కవితా ఎస్. మన్నికేరి అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన పట్టణ, స్థానిక సంస్థల వివిధ ప్రాజెక్టుల ప్రగతి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడానికి, ప్రభుత్వ వివిధ పథకాల కింద చేపట్టిన రోడ్లు, మురుగు నీటి పారుదల, విద్యుత్ దీపాలు, వ్యర్థాల తొలగింపు, ఇతర అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. స్థానిక సంస్థల్లో మిగిలిన నిధులను ప్రాథమిక సౌకర్యాలు, అభివృద్ధి పనుల కోసం నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వ సహాయం, అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్లు వంటి వివిధ పథకాలను లబ్ధిదారులకు సమన్వయంతో పంపిణీ చేయాలన్నారు. జిల్లా పట్టణాభివృద్ధి సెల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, పట్టణ స్థానిక సంస్థల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.


