వాడీవేడిగా బడ్జెట్ ముందస్తు సమావేశం
సాక్షి బళ్లారి: నగరంలో సమస్యలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయని, ఓ వైపు మంచి నీటి సమస్య, మరో వైపు అస్థవ్యస్థమైన రోడ్లు, యూజీడీతో జనం సతమతం అవుతున్నారని ఆక్రమణలు చేసుకొని యథేచ్ఛగా భవనాల నిర్మాణం కొనసాగుతున్నా పాలికె చోద్యం చూస్తోందని పలువురు నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మహానగర పాలికె కార్యాలయంలో నూతన మేయర్ గాదెప్ప అధ్యక్షతన జరిగిన తొలి బడ్జెట్ ముందస్తు సమావేశంలో సమస్యలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. బడ్జెట్ కన్నా ముందు పలువురి సలహా సూచనలు తీసుకొని బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకొన్న నేపథ్యంలో నగరంలోని పలు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగరంలోని సమస్యలపై అవగాహాన ఉన్న ప్రముఖులు హాజరై నగరంలోని సమస్యలను పాలికె ముందు ఉంచారు.
పాలికె ఆదాయాన్ని పెంచండి
ఆంధ్రాళ సేవా సమితి అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త ఆర్.వెంకటరెడ్డి మాట్లాడుతూ నగరంలో పేరుకుపోయిన, రాజకీయ పలుకుబడి కలిగిన పెద్దల నుంచి ముందుగా పన్నులను ఎలాంటి మొహమాటం లేకుండా వసూలు చేయాలన్నారు. మరో సామాజిక కార్యకర్త మేకల ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కొళగల్లులో మంచినీటి చెరువుకు 297 ఎకరాలను సేకరించిందన్నారు. అయితే పాలికె డంపు యార్డ్‌గా మార్చుకుందని మండిపడ్డారు. నగరంలోని పార్కులు అధ్వానంగా ఉన్నాయని, వాటిని సరిచేయాలన్నారు. అలాగే వేణుగోపాల్, సిద్ధేశ్ మాట్లాడుతూ నగర పాలికె పరిధిలో పలు సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేసి పరిష్కరించాలన్నారు. కర్ణాటక వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లాధ్యక్షుడు వీరభద్రగౌడ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇతర మహానగర పాలికెల పరిధిలో అమల్లో ఉన్న విలేకర్ల క్షేమాభివృద్ధి నిధులను బళ్లారిలో కూడా అమలు చేయాలన్నారు.
ప్రైవేట్ స్కూళ్లపై పన్ను వేయండి
నవ కర్ణాటక యువశక్తి సంఘం సీ.మంజునాథ్ మాట్లాడుతూ నగరంలో ఇళ్లల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలల నుంచి పన్నులు వసూలు చేయాలన్నారు. కర్ణాటక యువక సంఘం అధ్యక్షుడు బసవరాజు మాట్లాడుతూ పెద్ద మార్కెట్‌లో అమ్మకాలు సాగిస్తున్న ప్రతి ఒక్కరితో డబ్బులు వసూలు చేసి నగరాభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. సమస్యలను ఆలకించిన తర్వాత నూతన మేయర్ గాదెప్ప మాట్లాడుతూ నగరంలోని వివిధ సంఘ సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఇచ్చిన సలహాలను తూచ తప్పకుండా పరిగణలోకి తీసుకొని వాటిని పరిష్కరించేందుకు ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తం మీద సమావేశంలో నగర సమస్యలపై పెద్ద ఎత్తున చర్చించడంతో అధికారులు, పాలక వర్గం ఉక్కిరిబిక్కిరి అయ్యింది.
సమస్యలపై గళం విప్పిన జనం
పలు డిమాండ్లు వినిపించిన వైనం


