భూబాధిత రైతులను ఆదుకోండి
సాక్షి బళ్లారి: కుడితినిలో ఎన్నో నెలలుగా ఆందోళన చేస్తున్న భూమి ఇచ్చిన రైతులను మానవతా దృక్పథంతో త్వరలో పరిష్కరించాలని విధాన పరిషత్ సభ్యుడు వైఎం.సతీష్ డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల రెండో రోజు బెళగావిలో జరిగిన విధాన పరిషత్తులో ఆయన గళం విప్పారు. కుడితిని పరిసరాల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు కుడితిని, వేణివీరాపురం, సిద్ధమ్మనహళ్లి, హరగినడోణి తదితర చుట్టు పక్కల గ్రామాల్లో రైతుల నుంచి కేఐఏడీబీ స్వాధీనం చేసుకొన్న భూమిలో పరిశ్రమలు నెలకొల్పకపోవడంతో భూమి ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తక్కువ ధరతో భూమిని కొనుగోలు చేసి, భూమి ఇచ్చిన రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొందన్నారు. అయితే అటు పరిశ్రమలను నెలకొల్పక, ఇటు ఉద్యోగాలు రాకపోవడంతో రైతుల కుటుంబాలు వీధినపడ్డాయన్నారు.
12 వేల ఎకరాలకు పైగా స్వాధీనం
ఆర్సెలార్ మిట్టల్ ఇండియా లిమిటెడ్, ఉత్తమ్ గాల్వా ఫెరోస్ లిమిటెడ్, కర్ణాటక విజయనగర స్టీల్ తదితర కంపెనీలు ఈ ప్రాంతంలో సుమారు 12 వేల ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకొన్నాయన్నారు. అయితే పరిశ్రమలను నెలకొల్పకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు కోర్టును ఆశ్రయించడంతో ఎకరాకు రూ.1.30 కోట్లు ఇవ్వాలని సూచించిందన్నారు. అయితే రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో కుడితినిలో ఎన్నో నెలలుగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఆ రైతులను మానవత దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 15 సంవత్సరాలుగా భూమి ఇచ్చిన రైతులు చేస్తున్న ఆందోళనపై మనవిని ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయన్నారు.
పరిషత్‌లో ఎమ్మెల్సీ సతీష్ డిమాండ్


