ప్రజలను మభ్య పెట్టడానికే టిప్పు జయంతి
హుబ్లీ: బెళగావి సువర్ణ సౌధ అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చకు మేం సిద్ధం అయితే మంత్రి కాశప్పకు రైతుల సమస్యలు పట్టడం లేదని, దీంతో ఆయన టిప్పుసుల్తాన్ జయంతి వేడుకలను సాకుగా చూపుతూ వెనుకబడిన ఈ ప్రాంత ప్రజల చిత్తశుద్ధిని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే హెచ్‌ఆర్.విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఓ మతాంధుడు, మత మారణహోమానికి పాల్పడిన ఓ వ్యక్తి జయంతి ఆచరణకు ప్రభుత్వం నిలబడటం సిగ్గు చేటు అన్నారు. తీవ్ర సమస్యల గురించి మాట్లాడమని అంటే ఈ విషయాన్ని సాకుగా చెప్పి రైతన్న సమస్యలపై ఉదాసీనత చూపడం తగదన్నారు. బీజేపీ ఏనాటికీ మత సామరస్యానికి భంగం కలిగించదన్నారు. ఇలాంటి విషయాలలో చిచ్చు పెట్టేది కాంగ్రెస్ నేతలే అన్నారు. బెంగళూరులో మత్తు పదార్థాఽల విషయంపై మాట్లాడుతూ యథేచ్చగా సాగుతున్న వీటి విక్రయాలను అరికట్టడంలో సిద్దు సర్కారు పోలీస్ శాఖ వైఫల్యంపై ఆయన కఠిన పదజాలంతో దూషించారు. ఈ దేశ ప్రజలను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చితే ఈ దేశాన్ని పాడు చేసినట్లే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పదార్థాలు ఆఫ్రికా, పాకిస్తాన్ నుంచి ఎక్కువగాను అందులోను జీపీఎస్ ద్వారా పంపిస్తున్నారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన హోం శాఖ అడ్డుకోవాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో వీటి విక్రయాలతో పాటు సైబర్ క్రైం నివారణకు సుమారు 3 లక్షల మంది కళాశాల విద్యార్థులకు చైతన్య కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు.


