అప్పుల బాధకు మరో రైతు బలి
బళ్లారిఅర్బన్: అప్పుల బాధకు మరో రైతు బలైన ఘటన జిల్లాలోని కురుగోడు తాలూకా సోమసముద్రం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కోమారి(35) ఆత్మహత్య చేసుకున్న రైతు. కాగా ఈ యువ రైతన్నకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సాగు పనుల కోసం సహకార రైత బ్యాంక్, ఇతర వ్యాపార వర్గాల నుంచి చేసిన అప్పులు తీర్చలేక పోయారు. పొలానికి పెట్టుబడి పెట్టి పండించిన పంటంతా నేలపాలైంది. దీంతో మనోవేదనకు గురై కోమారి పంటలకు కొట్టే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కురుగోడు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
13న విద్యుత్ ఉద్యోగుల సమ్మేళనం
బళ్లారి రూరల్ : దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 13న కోల్‌కతాలో అఖిల భారత విద్యుత్ ఉద్యోగుల సమ్మేళనం జరుగనున్నట్లు ఏఐపీఎఫ్ అఖిల భారత అధ్యక్షుడు కే.సోమశేఖర్ తెలిపారు. సోమవారం పత్రికా భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ ఉద్యోగులపై దాడులు పెరగడం, ప్రైవేటీకరణ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా సమ్మేళనం జరుగుతోందన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్స్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పాత పింఛను పద్ధతిలో కనీసం రూ.10 వేల పింఛను ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఈ దిశగా కోల్‌కతాలో జరుగనున్న సమ్మేళనానికి కర్ణాటక రాష్ట్రం నుంచి విద్యుత్ ఉద్యోగులు తరలి వెళ్లనున్నట్లు తెలిపారు. ఏఐపీఎఫ్ ప్రముఖుడు డాక్టర్ ప్రమోద్, ఏఐయూటీసీ జిల్లాధ్యక్షుడు కామ్రేడ్ ఏ.దేవదాస్, ప్రముఖులు సురేశ్, జి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ
బళ్లారి రూరల్ : జిందాల్ ఓపీజే సెంటర్‌లోని తమన్నా దివ్యాంగుల పాఠశాలలో సోమవారం అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలకు శిక్షణ శిబిరం జరిగింది. కార్యక్రమాన్ని జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ దక్షిణ వలయ ప్రముఖుడు పెద్దన్న జ్యోతి వెలిగించి ప్రారంభించారు. దివ్యాంగ బాలలను ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి? అనే విషయంపై అంగన్‌వాడీ టీచర్లకు, కార్యకర్తలకు తమన్నా పాఠశాల సిబ్బంది నాటకాల ద్వారా అవగాహన కల్గించారు. సండూరు, కృష్ణానగర్, తారానగర్, నాగలాపుర, బనహట్టి, తాళూరు, జోగ, బసాపుర, ఒడ్డు, కురేకుప్ప, దరోజీ, భుజంగనగర్, తోరణగల్లుకు చెందిన 130 మంది అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు, తమన్నా పాఠశాల ప్రధానోపాధ్యాయిని సవిత, అంగన్‌వాడీ అధికారి చైతన్య పాల్గొన్నారు.
అంబేడ్కర్‌కు ఘనంగా నివాళి
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరులో అంబేడ్కర్ ప్రతిమ వద్ద అంజుం ఏ ముస్లిం నేతలు కొవ్వొత్తులతో ఘనంగా నివాళి అర్పించారు. ఆదివారం రాత్రి భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 68వ పరినిర్వాణ దినోత్సవంలో భాగంగా అంబేడ్కర్ ప్రతిమకు పూలమాల వేశారు. కమిటీ అధ్యక్షుడు హుసేన్ బాషా మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, బాధ్యతల గురించి ప్రజలకు ప్రచారం చేస్తామన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రామాణికంగా పని చేస్తామన్నారు. అన్సరుద్దీన్, ముస్తాఫా, అమీన్, ఖయ్యూం, హసన్, అబ్దుల్, సలీం, ఆరీఫ్‌లున్నారు.
జీపీ సభ్యుడిపై కుక్కల దాడి
హుబ్లీ: గ్రామ పంచాయతీ(జీపీ) సభ్యుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన జరిగింది. ఫలితంగా ఆయన రెండు వేళ్లు తెగిపోయాయి. విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా ఉచ్చంగిదుర్గ వద్ద హాలమ్మన తోపులో కుక్కలు గ్రామ పంచాయతీ సభ్యుడు మంజునాథ్‌పై తీవ్రంగా దాడి చేశాయి. ఆయన వాకింగ్‌కు వెళ్లిన వేళ ఈ దారుణ దురంతం చోటు చేసుకుంది. రెండు వేళ్లు కట్ అయిన స్థితిలో ఆయన్ను దావణగెరె జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అప్పుల బాధకు మరో రైతు బలి
అప్పుల బాధకు మరో రైతు బలి
అప్పుల బాధకు మరో రైతు బలి


