గోవధ నిషేధ చట్టం రద్దు తగదు
సాక్షి, బళ్లారి: ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి పశువులను, గోవులను యథేచ్ఛగా వధించేందుకు అనుమతి ఇస్తున్న నేపథ్యంలో ఇది ఎంత మాత్రం సరైన చర్య కాదని విశ్వహిందూ పరిషత్, బీజేపీ, పలువురు స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని నారాయణరావ్ పార్కు నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు విశ్వహిందూ పరిషత్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి జిల్లాధికారి కార్యాలయం ద్వారా గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం పంపించారు. గోవుల్లో సకల దేవతలు కొలువుదీరి ఉంటారని పురాణాలు, ఇతిహాసాలు ఘోషిస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో 2020వ సంవత్సరంలో అప్పటి బీజేపీ ప్రభుత్వం గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు.
పాలనలో ఈ సర్కారు విఫలం
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పాలనలో ఘోరంగా విఫలం అయ్యారని ఆరోపించారు. చివరికి గోవుల రక్షణకు చేసిన చట్టాన్ని కూడా రద్దు చేయాలని తలచడం హేయం అన్నారు. బెళగావిలో అసెంబ్లీ సమావేశాల్లో ఈ నిర్ణయాన్ని ప్రతిపాదించి అమలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయంతో హిందూ సమాజానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇప్పటికే అక్రమంగా గోవులను తరలించి వధిస్తున్నారన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తే మరింతగా గోవధ జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచన చేయకుంటే భారీ ఆందోళన తప్పదన్నారు. కమ్మరచేడు కళ్యాణ స్వామీజీ, నాయకులు రామలింగప్ప, వెంకటరమణ, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.
గోవధ నిషేధ చట్టంలో మార్పులు చేయొద్దు
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోవధ నిషేధ చట్టంలో మార్పులు చేయడం తగదని హిందూ జన జాగరణ వేదిక డిమాండ్ చేసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళనకారులనుద్దేశించి కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య మాట్లాడారు. గతంలో బీజేపీ సర్కార్ అమలు పరిచిన గోవధ నిషేధ చట్టాన్ని రద్దు చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గో సంరక్షణ చట్టంలో ఎలాంటి మార్పులు, చేర్పులకు పూనుకోరాదని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాగరాజ్ భాల్కి, మునిరెడ్డి, విజయ కుమార్, బాళప్ప, శరణు తదితరులున్నారు.
2020 నాటి చట్టాన్ని కొనసాగించాలి
విశ్వహిందూ పరిషత్ నేతల డిమాండ్
గోవధ నిషేధ చట్టం రద్దు తగదు


