ప్రతిభాన్విత విద్యార్థులకు సన్మానం
హొసపేటె: కర్ణాటక ప్రతిభా అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. విజయనగర జిల్లాలో టెన్త్, పీయూసీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. జిల్లాలోని హొసపేటె, హగరిబొమ్మనహళ్లి, హువిన హడగలి, హరపనహళ్లి, కొట్టూరు, కూడ్లిగి తాలూకాల నుంచి ఒక్కొక్కరికి కలిపి 10 మంది చొప్పున ఆరు తాలూకాలకు చెందిన మొత్తం 60 మంది అర్హులైన, ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి సత్కరించారు. హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, బీఈఓ శేఖర్ హొరపేటె, సోమశేఖర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్‌ను లారీ ఢీకొని డ్రైవర్ మృతి
బళ్లారి రూరల్: ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన హగరి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. సంబంధీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అసుండికి చెందిన బసవరాజు (30) ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండేవాడు. ఆదివారం రాత్రి హగరి వద్ద ట్రాక్టర్ నడుపుకొంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బసవరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పీడీహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని బీఎంసీఆర్‌సీ మార్చురీకి తరలించారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


