ప్రమాదంలో... ప్రజారోగ్యం
సాక్షి, బళ్లారి: ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని, వాతావరణంలో ప్రభావం చూపుతుందని తెలిసినా ప్రజలు వినియోగిస్తూనే ఉన్నారు. 50 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. దీనిని పక్కాగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పట్టణ వీధులు, మురుగు కాల్వలు ప్లాస్టిక్ కూపాలుగా మారుతున్నాయి. రోగాలు పెంచుతున్నాయి. జీవ మనుగడపై దుష్ప్రభావం కలిగించే ప్లాస్టిక్ నిషేధంతో నగర, పురపాలక సంస్థలు వైఫల్యం చెందుతున్నాయి. బళ్లారి జిల్లాతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలలోనూ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉంది. బళ్లారి పట్టణ జనాభా పెరుగుతుండడంతో టన్నుల కొద్దీ చెత్త సేకరించాల్సి వస్తోంది. ఇందులో ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగిస్తే పురపాలక శాఖ అధికారులు దాడులు చేసి జరిమానా వేయవచ్చు. రూ.500 నుంచి రూ.5 వేల వరకు అపరాధ రుసుము విధించవచ్చని అధికారులే చెబుతున్నారు.
ఎక్కడపడితే అక్కడ
ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. మురుగు కాల్వల్లో వేయడంతో నాలాలకు అడ్డంపడి మురుగు రోడ్లపైకి చేరుతోంది. కల్వర్టులకు అడ్డంగా చేరి వర్షం వస్తే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. దుకాణదారులు డ్రైనేజీలపై బండలు వేయడంతో వాటి కింద ప్లాస్టిక్ ఇరుక్కుపోయి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బళ్లారిలోని ప్రతి అంగడి, హోటళ్లు, కూరగాయాల దుకాణాల్లో ఎటుచూసినా ప్లాస్టిక్ వాడకం పెరిగింది. హోటల్‌లో ఇడ్లీలు తయారు చేసే స్టాండ్లలనూ ప్లాస్టిక్ కవర్లు వేసి, అందులో ఇడ్లీ పిండి వేసి తయారుచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వేడి వేడి సాంబారు, అన్నం, పప్పు, దోసెలు, ఇతర వంటకాలన్నీ పార్శిళ్లలో తీసుకెళ్తున్నారు.
పల్లె, పట్టణాల్లో విచ్చలవిడిగా
ప్లాస్టిక్ వినియోగం
నిషేధం అమలులో ఉన్నా చోద్యం చూస్తున్న యంత్రాంగం
హోటల్, బేకరీల్లో వేడి పదార్థాలన్నీ ప్లాస్టిక్ లోనే..
ప్లాస్టిక్ బ్యాగుల్లో ఆహారంతో ప్రమాదం
ప్టాస్టిక్ క్యారీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలు తినడంతో ప్రమాదకరమైన ‘కార్సినోజన్లు’ శరీరంలో చేరి క్యాన్సర్‌కు దారితీస్తుందని, చర్య వ్యాధుల సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో మిగిలిన ఆహారం, కూరగాయల వ్యర్థాలు ఈ ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి చెత్త కుండీల్లో వేస్తున్నారు. మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ భూమి పొరలో చేరి భూగర్భ కాలుష్యం ఏర్పడుతోంది. ప్లాస్టిక్ కాల్చివేయడం వల్ల అందులోని రసాయనాలు వాతావరణంలో కలిసి మానవ, జీవ రాశుల మనుగడపై ప్రభావం చూపుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.


