నేరాల నియంత్రణపై ప్రచారం
రాయచూరురూరల్: నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం నడుంబిగించిందని ఎస్పీ పుట్టమాదయ్య అన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించేలా గోడలపై వివరాలు రాసే కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఅర్‌ఎస్ 112, 1930 సహాయవాణి అంశాలపై ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. సాంకేతిక రంగంలో మార్పులు వచ్చినా, నేరాలు తగ్గకపోవడంపై ప్రతి ఒక్కరూ అలోచించాలన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ను వినియోగించే వారంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ శాంతవీర, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
బెటాలియక్ కోసం సీఎంకు లేఖ
రాయచూరురూరల్: కెఎస్‌ఆర్‌పీ బెటాలియన్ కేంద్రం రాయచూరులో ఏర్పాటు చేయాలని స్థానికులు సీఎం సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి పరమేశ్వర్‌లకు లేఖ రాశారు. కళ్యాణ కర్నాటక ప్రాంతంలోని కలబుర్గిలో ఉన్న కర్నాటక రాష్ట్ర రిజర్వ్‌డ్ పోలీస్ బెటాలియన్‌ను మహిళ రిజర్వుడ్ పోలీస్ బెటాలియన్ కేంద్రంగా మార్చారు. మరోవైపు మునిరాబాద్‌లో ఉన్న బెటాలియన్‌ను కలబుర్గికి రావాలంటూ ఆదేశాలిచ్చారు. దీంతో రాయచూరు ప్రాంతంలో బందోబస్తు కఠినం అవుతుందని, 13వ కేఎస్‌ఆర్‌పీ బెటాలియన్‌ను రాయచూరులో కొనసాగించాలని స్థానికులు లేఖరాశారు.
కార్మికులకు కిట్లు పంపిణీ
రాయచూరురూరల్: ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మాన్వి విధాన సభ సభ్యుడు హంపయ్యనాయక్ కోరారు. తాలుకాలోని బల్లటిగిలో పలువురు కార్మికులకు ఆయన కిట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు దైనందిన పనులతోపాటు.. తమ పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, వారిని విద్యారంగం వైపు మరల్చాలని సూచించారు. కార్మికుల పిల్లలకు వసతిగృహ సౌకర్యం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మల్లప్ప, శరణబసవ, పరశురామ్, పంపణ్ణ, సుదానంద, రమేష్, జాఫర్, అబ్రహాం, మారేష్, మౌనేష్ పాల్గొన్నారు.
తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం
రాయచూరురూరల్: నగరంలోని యాదవ సమాజం పాఠశాలలో రూ.80 లక్షలతో చేపట్టిన రెండు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మారెప్ప, హనుమంతప్ప, తమ్మప్ప, దానప్ప యాదవ్, మురళీ యాదవ్, లక్ష్మణ్, రాఘవేంద్ర, విష్ణు, అస్లాం పాషా, దరూరు బసవరాజ్, రజాక్ ఉస్తాద్, అబ్దుల్‌కరీం, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ పాత్రికేయ అవార్డుకు విరాళం
రాయచూరురూరల్: ఉత్తమ పాత్రికేయ పురస్కారాలు అందించేందుకు రూ.3 లక్షల చెక్కును అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ఖండ్రే అందజేశారు. బీదర్ భవనంలో జరిగిన రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, 2025–28 పదాధికారుల పద గ్రహణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీమణ్ణ ఖండ్రే పేరిట రూ.3 లక్షలతో దత్తనిధి ఏర్పాటు చేసి అవార్డులందించాలని రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శివానంద ప్రతిపాదించగా మంత్రి అంగీకరిస్తూ చెక్ అందజేశారు. అనంద దేవప్ప, అప్పారావ్, శివకుమార్ పాల్గొన్నారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
కోసిగి: కర్నూలు జిల్లా కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి బీదర్ వెళ్లే రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుని వద్ద ఆధార్ కార్డు ఆధారంగా రాయచూరు జిల్లా ఆరోలి గ్రామానికి చెందిన తిమ్మప్ప (45) అనే వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. అనారోగ్యంతో రాయచూరు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా, జబ్బు నయం కాక ఇక్కడకు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.
నేరాల నియంత్రణపై ప్రచారం
నేరాల నియంత్రణపై ప్రచారం
నేరాల నియంత్రణపై ప్రచారం


