కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం
హొసపేటె: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని మాజీ మంత్రి బి.శ్రీరాములు పేర్కొన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం, బూత్ స్థాయి కార్యకర్తల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు రైతుల కష్టాలను వినడం లేదన్నారు. కుర్చీల కోసం పోరాడుతున్న పాలకులపై ప్రజలు కోపంగా ఉన్నారని, బీజేపీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను సామాన్యులకు తెలియజేసేలా కార్యకర్తలు పనిచేయాలని ఆయన వివరించారు. రాబోయే జీపీఎం, టీపీఎం, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను తెరపైకి తీసుకురావాలని కోరారు. విజయనగర నియోజకవర్గంలో బీజేపీ బలం, ప్రస్తుత ఎమ్మెల్యేల నిష్క్రియాత్మకత గుర్తించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత బూత్‌స్థాయి కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి, చెన్నబాషా, వనగౌడపాటిల్, అయ్యాలి తిమ్మప్ప, సందీప్‌సింగ్, శంకర్‌మేటి, ఎన్.రూపేష్‌కుమార్, అశోక్ జీరే, తదితరులు పాల్గొన్నారు.


