సీఐకి కన్నీటి వీడ్కోలు
హుబ్లీ: రోడ్డు ప్రమాదంలో ఓ పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. హావేరిలో లోకాయుక్త సీఐగా పని చేస్తున్న పంచాక్షరి సాలిమఠ(54) స్వస్థలం బెళగావి జిల్లా మురగోడ కాగా తాను ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఫలితంగా కారు ఇంజిన్‌లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని కాలిబూడిదయ్యారు. ఎముకలు కూడా దొరకని స్థితిలో సీఐ మృతదేహం కనిపించింది. తన విధులను ముగించుకుని భార్య, పిల్లలను చూడటానికి గదగ్ వైపు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. కాగా కాలిబూడిదైన ఆయన దేహం, కారు నంబరు, ధరించిన ఉంగరం ద్వారా సీఐ మృతదేహంగా గుర్తించారు. హుబ్లీ కిమ్స్‌లో ఆయన సహోద్యోగులు, సిబ్బంది చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. బంధువులు, స్నేహితులు, భార్య, పిల్లల రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు. హుబ్లీ–ధార్వాడ పోలీసు కమిషనర్ శశికుమార్ విలేకరులతో మాట్లాడుతూ సాలిమఠ తన విధులను ఎంతో చక్కగా నిర్వహించేవారని ప్రశంసించారు. ప్రజలతో పాటు పోలీసుల్లో కూడా మంచిపేరు తెచ్చుకున్నారన్నారు. ఆయన 2003వ బ్యాచ్‌కు చెందిన వారని, ప్రస్తుతం లోకాయుక్త సీఐగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి సమర్థ అధికారి ఇలా కారు ప్రమాదంలో ఘోరంగా మరణించడం తమను ఎంతో బాధిస్తోందన్నారు.
అగ్నిప్రమాదంలో లోకాయుక్త సీఐ దుర్మరణం
రాయచూరు రూరల్: కారులో వెళుతుండగా జరిగిన అగ్నిప్రమాదంలో లోకాయుక్త సీఐ పంచాక్షరి సాలిమఠ దుర్మరణం పాలైన ఘటన ధార్వాడ జిల్లా అణ్ణిగేరి వద్ద జరిగింది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని కారులో బయలుదేరారు. అయితే కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో గుంతలో పడ్డ కారు ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. పంచాక్షరి సాలిమఠ గతంలో బైలహొంగల, గదగ్, హుబ్లీలలో విధులు నిర్వహించారు.


