పశువుల ఆస్పత్రి మార్పు వద్దు
కేజీఎఫ్: బంగారు గనుల ప్రాంతంలో బ్రిటీష్ హయాంలో నిర్మించిన మైసూర్ మైన్స్ ప్రాథమిక పశువుల ఆస్పత్రిని మరో ప్రాంతానికి తరలించవద్దని గ్రామీణ ప్రాంతాల రైతులు హెచ్చరిస్తున్నారు. బంగారు గనుల ప్రాంతంలోని ఐదు వార్డులకు చెందిన మారికుప్పం, బళిగానహళ్లి, గిడ్డగౌడనహళ్లి, కేజీఎఫ్ ఎ బ్లాక్, సౌత్ బ్లాక్, హళ్లి కుడ్య, చిన్నకల్లు, నగర కమీషన్ లైన్, పర్పెంటర్ కాలనీ, ఛాంపియన్ రైల్వే స్టేషన్ కాలనీలలోని పలు కుటుంబాలు జెర్సీ ఆవులు, గొర్రెలు, మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వీరంతా తమ పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఈ ఆస్పత్రిలోనే టీకాలు వేయిస్తారు. ఈ ఆస్పత్రిలో సుమారు నెలకు 9 నుంచి 10 వేల మూగ ప్రాణులకు చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే సిఫారసు మేరకు ఇపుడు అకస్మాత్తుగా ఆస్పత్రిని బడమాకనహళ్లికి తరలించడం తగదని, అలాచేస్తే తాము చూస్తూ ఊరుకోమని ఆ గ్రామాల పాడి రైతులు హెచ్చరిస్తున్నారు. స్థలాంతరం చేయడం వల్ల పశువుల చికిత్సకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిని అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రిని ఇక్కడి నుంచి తరలించవద్దని కోరుతున్నారు.


