దేవుని ఫ్లెక్సీకి నిప్పు
సాక్షి,బళ్లారి: కార్తీక మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పరమశివుని ఫ్లెక్సీకి కొందరు దుండగులు నిప్పు పెట్టడంతో దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకాలో కలకలం రేగింది. శుక్రవారం రాత్రి హొన్నాళి తాలూకా సాసివెహళ్లి గ్రామంలో కల్లేశ్వర కార్తీక మహోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. కొందరు దుండగులు ఫ్లెక్సీకి నిప్పు పెట్టడంతో గ్రామంలో పెద్ద ఎత్తున జనం చేరి ఆందోళన చేశారు. మాజీ మంత్రి రేణుకాచార్య ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు నాయకత్వం వహించారు. సాక్షాత్తు సృష్టి లయకర్త శివుడి కార్తీక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటే దుండగులు ఇలాంటి నీచకృత్యానికి పాల్పడ్డారని, దుండగులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మత కలహాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న దుర్మార్గులపై పోలీసులు దృష్టి సారించి వెంటనే అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
నిరసన వ్యక్తం చేసిన సాసివెహళ్లి గ్రామస్తులు
దావణగెరె జిల్లా హొన్నాళి
తాలూకాలో కలకలం


