పకడ్బందీగా టెట్ పరీక్ష
హొసపేటె: ఉపాధ్యాయ అర్హత పరీక్ష పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు జిల్లా కలెక్టర్ ఇ.బాలకృష్ణ ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ సన్నాహక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 7న తొలి సెషన్‌లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఐదు పరీక్ష కేంద్రాలలో 2,128 మంది అభ్యర్థులు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు 19 పరీక్షా కేంద్రాలలో 6,570 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది సమయానికి హాజరుకావాలన్నారు. పర్యవేక్షకులు స్వయంగా కేంద్రాలను సందర్శించి లోపాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మూడు, నాలుగు కేంద్రాలకు రూట్ అధికారి ఉండాలని, ప్రతి కేంద్రంలో పోలీసులను మోహరించి అన్ని విధాలా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ జి.మంజునాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రామచంద్రప్ప, సిబ్బంది పాల్గొన్నారు.


