భవానీ విగ్రహం ఊరేగింపు
సాక్షి, బళ్లారి: భక్తుల ఆరాధ్యదైవం విజయవాడ కనకదుర్గమ్మ దీక్ష స్వీకరించిన భక్తులు గురువారం రాత్రి పట్టణంలో భవానీ విగ్రహాన్ని అలంకరించి వైభవంగా ఊరేగించారు. నగరంలోని బంటిమోట్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు నగరంలోని ఏపీఎంసీ, బెంగళూరు రోడ్డు, రాయల్ సర్కిల్, కనక దుర్గమ్మ ఆలయం వరకూ సాగింది. ఎరుపురంగు దుస్తులు ధరించి అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులు డప్పులు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ జై భవానీ నినాదాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. గురుస్వామి, మహిళా భక్తులు కళశాలు పట్టి ముందు నడిచారు. అలాగే కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అన్నదానం నిర్వహించారు. శ్రీరాంపురం కాలనీ నివాసి భవానీ ప్రసాద్ కనకదుర్గమ్మ అమ్మవారికి విశేష పూజలు జరిపారు. గురుస్వామి లోకేష్ స్వామి, బీఆర్‌ఎల్ శీన మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా నగరంలో భవానీ దీక్ష స్వీకరించి అమ్మవారిపై తమ భక్తిని చాటుతున్నారన్నారు.


