రక్షిత మంచినీరు అందించండి
రాయచూరు రూరల్: రాయచూరు నగరవాసులకు రక్షిత మంచినీటిని అందించాలని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచూరు జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. నగర పరిధిలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలన్నారు. రూ.40 లక్షలతో లీకేజీ మరమ్మతు పనులు చేపట్టారన్నారు. తాగునీటిని పరీక్ష కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పంపాలన్నారు. వాణిజ్య పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను వసూళ్లకు చొరవ చూపాలన్నారు. నగరసభలో అదనంగా 75 మంది పౌర కార్మికుల నియామకాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నగరంలో ఆక్రమించిన కట్టడాలు, స్థలాల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నగరంలోని 36 మురికివాడల ప్రాంతాలు, 35 వార్డుల్లో ఈ–ఖాతాలను అందించాలన్నారు. సమావేశంలో శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్, ఆర్‌డీఏ అధ్యక్షుడు రామస్వామి, జిల్లాధికారి నితీష్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఎస్పీ పుట్టమాదయ్యలున్నారు.
పేదలకు గూడు కల్పనే లక్ష్యం
రాష్ట్రంలో పేదలకు ఇళ్లు లేని వారికి గూడు కల్పించడమే సర్కార్ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ పేర్కొన్నారు. బుధవారం రాయచూరు నగర పరిధిలో నిర్మాణాలు చేపట్టిన రాజీవ్‌గాంధీ వసతి పథకంలో 2419 ఇళ్లను పరిశీలించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. ఎస్సీలకు 952, ఎస్టీలకు 1053, జనరల్‌కు 228, ఇతరులకు 187 ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు. రాజీవ్ గాంధీ వసతి పథకంలో 2023లో ప్రారంభమైన పనులు 2028 నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేస్తారన్నారు. నాణ్యతతో కూడిన విధంగా ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. తాగునీరు, మురుగు కాలువలు, రహదారులు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. లబ్ధిదారులకు రూ.9 లక్షలకే నివాసాలను అందచేస్తారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి అసమ్మతి కుంపటి లేదన్నారు. పార్టీలో అందరూ సమానులేనని అన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఎవరికీ అధికారం శాశ్వతం కాదని అన్నారు. అందరూ డిన్నర్లు ఇస్తారు, వాటిలో పాల్గొనడం తప్పా? అని ప్రశ్నించారు. మంత్రి వెంట మస్కి శాసన సభ్యుడు బసనగౌడ, ఆర్డీఏ అధ్యక్షుడు రామస్వామి, జిల్లాధికారి నితీష్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఎస్పీ పుట్టమాదయ్య, శాలం, నరసింహులు, ఈరణ్ణలున్నారు.
అధికారులకు మంత్రి సురేష్ సూచన


