నిమ్న వర్గాల అభివృద్ధే ధ్యేయం
బళ్లారి రూరల్: నిమ్న వర్గాల అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయమని కార్మిక శాఖ మంత్రి సంతోష్‌లాడ్ తెలిపారు. సండూరు తాలూకా యంత్రాంగం, తాలూకా పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సండూరు తాలూకా విఠలాపురలో జరిగిన సంకల్పన సమర్పణ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తన రాజకీయ జీవితం విఠలాపుర గ్రామం నుంచి ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. 2004లో ఈ గ్రామంలో విద్యుత్ సమస్యను పరిష్కరించి అంచెలంచెలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తుంగభద్ర ఆనకట్ట నుంచి 80 గ్రామాల్లో 80 వేల ఇళ్లకు మంచినీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. రూ.60 కోట్ల నిధులను అణగారిన వర్గాల అభివృద్ధికి ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ తుకారాం మాట్లాడుతూ 2004 నుంచి సండూరు నియోజకవర్గానికి రూ.4,700 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. నంజుండప్ప నివేదిక ప్రకారం అత్యంత వెనుకబడిన తాలూకా సండూరును అభివృద్ధి చెందిన తాలూకాగా మార్చినట్లు తెలిపారు. 132 గ్రామాలకు రూ.425 కోట్లతో నీటి సరఫరాను అందించినట్లు తెలిపారు. సండూరు ఎమ్మెల్యే ఈ.అన్నపూర్ణ సండూరు తాలూకా అభివృద్ధి గురించి మాట్లాడారు. కర్ణాటక రాష్ట్ర ఖనిజ నిగమ నియమిత ఉపాధ్యక్షుడు హెచ్.లక్ష్మణ్, జగ్జీవన్‌రాం చర్మ పరిశ్రమల అభివృద్ధి నిగమ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజు, జిల్లా గ్యారంటీ యోజన అమలు ప్రాధికార అధ్యక్షుడు కె.ఈ.చిదానందప్ప, సండూరు తాలూకా గ్యారంటీ యోజన ప్రాధికార అధ్యక్షుడు నూరుద్దీన్, మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ఎల్.స్వామి, తోరణగల్లు వాడా అధ్యక్షుడు అక్షయ్ అశోక్‌లాడ్, అంతాపుర గ్రామపంచాయితీ అధ్యక్షుడు ఎన్.హొన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు.
విఠలాపుర నుంచే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది
కార్మిక శాఖ మంత్రి సంతోష్‌లాడ్ వెల్లడి
నిమ్న వర్గాల అభివృద్ధే ధ్యేయం


