నిధులున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదు?
సమావేశంలో పాల్గొన్న అధికారులు,
ప్రజాప్రతినిధులు
సమావేశంలో మాట్లాడుతున్న
మంత్రి బైరతి బసవరాజ్
బళ్లారిటౌన్: ప్రభుత్వం వద్ద నిధులు ఉన్నా అభివృద్ధి పనులకు ఎందుకు ఖర్చు చేసి చిత్తశుద్ధితో అభివృద్ధి చేయడం లేదు? అని అధికారుల తీరుపై నగరాభివృద్ధి శాఖ మంత్రి బైరతి బసవరాజ్ మండిపడ్డారు. నగరంలోని నూతన జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన ఆ శాఖ ప్రగతి పరిశీలన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.124 కోట్ల కార్యాచరణ యోజన పథకాన్ని తయారు చేయడానికి రెండు ఏళ్లు అవసరమా? అని ప్రశ్నించారు. ఆగస్టులో 134 వివిధ అభివృద్ధి పనులకు టెండర్ పిలువగా ఇంత వరకు వర్క్ ఆర్డర్‌ను ఎందుకు ఇవ్వలేక పోతున్నారని సూపరింటెండెంట్ ఇంజినీర్‌ను ప్రశ్నించారు.
సరిగా పని చేయకుంటే చర్యలు
సక్రమంగా పనులు చేయక పోతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. 10 రోజుల్లోగా ఈ పని పూర్తి కావాలని పేర్కొన్నారు. రూ.30 లక్షల బోర్‌వెల్‌లకు సంబంధించిన నిధులను ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. అకౌంట్‌లోనే పెట్టుకొని ఎందుకు కాలయాపన చేస్తున్నారన్నారు. నగరంలో పార్కులు, 5 చెరువుల అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులు ఉండగా ఎందుకు ఖర్చు చేయలేక పోయారని ధ్వజమెత్తారు. గత ఏడాది రూ.55 కోట్ల డిమాండ్ ఉండగా ఈ ఏడాది రూ.63 కోట్ల డిమాండ్ ఉందని అధికారులు పేర్కొనగా మంత్రి మీకు సరైన లెక్కలు రావడం లేదా? అని అధికారులపై కోపగించుకున్నారు.
పన్నులతో నగరాభివృద్ధికి ఊతం
బళ్లారి మహానగర పాలికెలో ప్రతి ఏడాది పన్నులను పెంచి వాణిజ్య భవనాలు పన్నులు, బకాయిలను వసూలు చేసి నగరాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. నగర పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న లేఅవుట్లపై డెవలపర్స్ పరంగా పనులు చేయకుండా సరైన నియమాల ప్రకారం అనుమతి ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ తుకారాం, ఎమ్మెల్యేలు నాగేంద్ర, భరత్‌రెడ్డి, మేయర్ గాదెప్ప, బుడా చైర్మన్ జేఎస్.ఆంజనేయులు, జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అధికారుల తీరుపై నగరాభివృద్ధి
శాఖ మంత్రి బసవరాజ్ మండిపాటు
నిధులున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదు?


