శ్రీనివాసపురం: నిత్యం ఏదో ఒకచోట ప్రైవేటు బస్సులు ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికులకు దడ పుట్టిస్తున్నాయి. ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదంలో మహిళ చనిపోయిన ఘటన కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకాలోని మంచినీళ్లకోట గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరు కు చెందిన అనిత (58) మృతురాలు. ఏపీలోని బద్వేల్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన హరిత ట్రావెల్స్ బస్సు ఘటనాస్థలిలో రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. అనిత అనే ప్రయాణికురాలు అక్కడే మరణించగా, 10 మందికిపైగా ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారి ఆర్తనాదాలతో అక్కడ బీభత్స వాతావరణం నెలకొంది. బాధితులను శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. బాధితులు ఏపీ, బెంగళూరువాసులుగా తెలిసింది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులున్నారు. బస్సు ముందు భాగం బాగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది.
అదుపులో డ్రైవరు
రాయల్పాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బస్సును జేసీబీతో తొలగించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిద్రమత్తు, నిర్లక్ష్యంగా నడపడమే కారణమని అనుమానాలున్నాయి.
డివైడర్‌ను ఢీకొని పల్టీలు
మహిళ మృతి, 10 మందికి గాయాలు
బద్వేలు నుంచి బెంగళూరుకు
వెళ్తున్న బస్సు
కోలారు జిల్లాలో ఘటన
మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం
మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం


