టెంటు మోసగాడు అరెస్టు
శివాజీనగర: లైంగిక సమస్య పరిష్కరించే నెపంతో ఐటీ ఇంజనీరును నమ్మించి రూ.48 లక్షలు వసూలు చేసిన నకిలీ ఆయుర్వేద వైద్యున్ని బెంగళూరు జ్ఞానభారతి పోలీసులు చేశారు. నిందితుడు మహారాష్ట్రలోని పూణె కు చెందిన విజయ్ గురూజీ అని తెలిపారు. నగరంలో రోడ్డు పక్కన టెంటు వేసుకుని నకిలీ ఆయుర్వేద ఉత్పత్తులను అమ్మేవాడు. ఓ టెక్కీ లైంగిక పటుత్వం కోసం ఇతనిని కలవగా నమ్మించి, ఆపై బెదిరించి నకిలీ మందులను అంటగట్టి రూ. 48 లక్షలు తీసుకున్నాడు. ఆ మందుల వల్ల టెక్కీకి కిడ్నీలు పాడై ఆస్పత్రిలో చేరాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించి పట్టుకున్నారు. రోడ్ల పక్కన టెంట్లలో అమ్మే ఔషధాలను ఉపయోగించరాదని, అటువంటివారిని సంప్రదించరాదని పోలీసులు సూచించారు.
లోకాయుక్త వలలో సర్వే అధికారి
మైసూరు: ఓ వ్యక్తికి పని ఇప్పించేందుకు లంచం తీసుకుంటూ జిల్లాలోని పిరియాపట్టణకు చెందిన ఏడీఎల్‌ఆర్ కార్యాలయ సర్వే అధికారి కేఆర్ రవీంద్ర లోకాయుక్తకు దొరికాడు. ఆయన పిరియాపట్టణలోని సర్వే శాఖలో ఈ–సర్వే స్కెచ్ తయారీ పని చేస్తున్నారు. స్కెచ్ తయారీలో తమకు పనులు ఇవ్వాలని ఎస్‌పీ రాఘవేంద్ర అనే వ్యక్తి ఈయనను కలిశారు. అందుకు రూ.90 వేల ముడుపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. హుణసూరులోని బార్‌లో అడ్వాన్స్‌గా రూ.30 వేల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు రవీంద్రను అరెస్టు చేశారు.
సత్యసాయి జీవితం
స్ఫూర్తిదాయకం
మాలూరు: సనాతన ధర్మరక్షణకు భగవాన్ సత్యసాయి బాబా అపారమైన కృషి చేశారని రత్నకుమార స్వామీజీ అన్నారు. తాలూకాలోని లక్కూరు గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో స్వామీజీ పాల్గొని మాట్లాడారు. సత్యసాయి బాబా జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. సత్యసాయి బాబా విద్య, అన్నదాసోహానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలను అందించారన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సత్యసాయి నేటికీ అందరి హృదయాల్లో నిలిచి ఉన్నారన్నారు. సమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కగ్గనూరు బాలకృష్ణ, మంజునాథ్‌రెడ్డి, సుబ్రహ్మణి తదితరులు పాల్గొన్నారు.
బాలికపై ఇద్దరి అఘాయిత్యం
దొడ్డబళ్లాపురం, హుబ్లీ: రాష్ట్రంలో నిత్యం ఏదో ఓ మూల కామాంధులు లైంగిక దాడులకు తెగబడుతున్నారు. 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన దారుణ సంఘటన బెళగావి జిల్లా మురగోడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గత నెల 23న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాలు.. బాలిక పిండిమిషన్‌కి వెళ్తున్న సమయంలో స్థానికులు మణికంఠ, ఈరణ్ణ అనే యువకులు బలవంతంగా చెరకుతోటలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిందితులను నిలదీశారు. నోరెత్తితే చంపేస్తామని దుండగులు బెదిరించారు. ఇప్పుడు గ్రామస్తులకు తెలియడంతో వారు ధైర్యం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నిందితులను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.


