దట్టంగా పొగమంచు
గౌరిబిదనూరు: స్థానికంగా గత నాలుగు రోజులుగా తుపాను వల్ల అప్పుడప్పుడు జడివాన కురిసింది. తుపాను వెళ్లిపోవడంతో వానలు పడలేదు. అయితే నగరం వెలుపల ఉదయం 9 గంటలదాకా దట్టమైన పొగమంచు కప్పేసింది. వాహనదారులు దారి కనిపించక అవస్థలు పడ్డారు. చలి తీవ్రంగా ఉంది. చల్లని ఈదురు గాలులు వీస్తూ పగటి ఉష్ణోగ్రత 14 డిగ్రీలకు పడిపోయింది. వృద్దులు, పిల్లలకు చలిని భరించడం కష్టంగా వుంది.
రూ.5 లక్షల వాచ్ చోరీ
హోసూరు: హోసూరు పారిశ్రామికవాడలో టైటాన్ జ్యూవెలరీ పరిశ్రమ ఆవరణలోనే చేతిగడియారాల విక్రయ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి షోరూంకు వెళ్లాడు. ఒక ఖరీదైన చేతి గడియారాన్ని చాలాసేపు పరిశీలించాడు. మధ్యాహ్నం సమయం కావడంతో ఉద్యోగులు భోజనం కోసం వెళ్లారు. కొంతమంది ఉద్యోగులు మాత్రమే షోరూంలో ఉన్నట్లు గ్రహించిన ఆ దొంగ చేతిగడియారాన్ని జేబులో వేసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం గడియారాలను లెక్కించిన ఉద్యోగులకు ఓ గడియారం కనిపించలేదని తెలిసి సిఫ్‌కాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గడియారం విలువ రూ.5 లక్షలని తెలిపారు. సీసీ కెమెరా చిత్రాల ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు.
చిట్టి పొట్టి బాలలం
బొమ్మనహళ్లి: స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు కనులపండువగా జరిగాయి. పలువురు ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. చిన్నారి బాలల నృత్యాలు అలరించాయి.
ఘరానా బ్యాంకు ఉద్యోగి.. రూ.47.72 లక్షల స్వాహా
మైసూరు: ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి ఉద్యోగం మానేసిన తర్వాత కూడా బ్యాంకు ఖాతాదారుల నుంచి సొమ్ము సేకరించి రూ.47.72 లక్షలను స్వాహా చేశాడు. ఈ ఘటన మైసూరులో జరిగింది. నిందితుడు మహదేవస్వామి గతంలో ఇండస్ బ్యాంకు వాణిజ్య విభాగంలో మేనేజర్‌గా పని చేస్తుండేవాడు. గత మే నెల నుంచి పత్తా లేడు, మొబైల్ కూడా స్విచాఫ్ అయింది. దీంతో అనుమానపడిన బ్యాంకు అధికారులు మహదేవస్వామి గతంలో వాహన యజమానుల నుంచి రుణాల ఖాతాలను తనిఖీ చేయగా కంతులు కట్టలేదని తేలింది. నిందితుడు వసూలు చేసుకుని జేబులో వేసుకున్నాడు. లెక్కపత్రాలను పరిశీలించగా మహదేవస్వామి రూ.47,72,810 లను సేకరించి బ్యాంకుకు చెల్లించలేదని తెలిసింది. సరస్వతీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కడతేరిన సహజీవన జంట
దొడ్డబళ్లాపురం: అక్రమ సంబంధాలు, సహజీవనం వంటివి చివరకు ప్రాణాలు తీస్తున్నాయి. గొడవలు చెలరేగి హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. వీటి వల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నామవుతున్నాయి. తాజాగా ప్రియురాలిని హత్య చేసి తరువాత ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఇందిరాప్రియదర్శిని నగరలో చోటుచేసుకుంది. లలిత (49), లక్ష్మినారాయణ (51) మృతులు. లలితకు భర్త లేడు, అతనికి భార్య లేదు, దీంతో ఇద్దరూ కలిసి సహజీవనం సాగిస్తున్నారు. అయితే తరచూ లలితను లక్ష్మినారాయణ అనుమానిస్తూ రగడ పడేవాడు. ఆదివారం రాత్రి కూడా పోట్లాటకు దిగారు. ఆమెను గొంతు పిసికి చంపి ఆపై ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. రాజగోపాలనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
దట్టంగా పొగమంచు
దట్టంగా పొగమంచు


