స్థాయి సమితి అధ్యక్ష స్థానం బీజేపీ కై వసం
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె నగరసభ స్థాయి సమితి నూతన అధ్యక్షుడుగా 14వ వార్డు బీజేపీ సభ్యుడు శరవణన్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ఉన్న 35 వార్డుల్లో నెలకొన్న సమస్యలను అరికట్టేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా నగరంలో అనేక వార్డుల్లో వర్షం వస్తే డ్రైనేజీలో నీరు చేరడంతో నిండిపోయి కాలనీలోకి ప్రవహిస్తోందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడతానన్నారు. అనంతరం నగరసభ అధ్యక్షులు రూపేష్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే గవియప్ప రూ.10 వేల కోట్ల పనులను ప్రజాపనుల శాఖకు అందించి నగరసభ అభివృద్ధికి మొండిచేయి చూపించారని ఆరోపించారు. నగరసభ ఉపాధ్యక్షులు జీవరత్నం, బీజేపీ నేత సందీప్ సింగ్, నగరసభ సభ్యులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సాక్షి,బళ్లారి: కంప్లి– సిరుగుప్ప రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. సోమవారం కెంచనగుడ్డకు చెందిన శివకుమార్(17), శ్రీకాంత్(18) అనే యువకులు కెంచనగుడ్డ గ్రామం నుంచి మణ్ణూరుకు బయల్దేరారు. మార్గమధ్యంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందకు పడి పోవడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. మరొకరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనతో మృతుల కుటుంబాలతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై తెక్కలకోటె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామాలకు మరిన్ని బస్సులు నడుపుతాం
రాయచూరు రూరల్: రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని బస్సు సర్వీసులను నడుపుతామని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ పేర్కొన్నారు. సోమవారం దేవదుర్గ బస్టాండ్‌లో ఆమె దేవదుర్గ–పుణె బస్సు సర్వీసును ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి దేవదుర్గ డిపోకు మరిన్ని బస్సులను సమకూర్చాలని ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రిని కోరగా దేవదుర్గకు కొత్తగా 20 బస్సులను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారన్నారు. ధర్మస్థల, ధార్వాడలకు కొత్త స్లీపర్ బస్సులను నడుపనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా శరణప్ప బళి, రంగణ్ణ పాటిల్, శిఖ రేషి, అయ్యణ్ణ, కృష్ణప్ప, నాగరాజ్ పాటిల్, మహదేవప్ప గౌడ, గౌరిలున్నారు.
త్వరలో 600 ఆర్టీసీ
బస్సుల కొనుగోలు
రాయచూరు రూరల్ : కళ్యాణ కర్ణాటక భాగంలో 600 ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు శ్రీకారం చుట్టామని కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ మండలి అధ్యక్షుడు అరుణ్ కుమార్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం లింగసూగూరు ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి బస్సుల కొనుగోలుకు అనుమతి లభించిందన్నారు. లింగసూగూరు పరిధిలో 133 రూట్లు ఉన్నాయన్నారు. బస్టాండ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. బస్ చార్జీల పెంపు విషయంలో ఇతర మండళ్లతో పోల్చితే తక్కువ ఉన్న విషయంపై అధికారులతో చర్చిస్తామన్నారు.
లారీ ఢీకొని తండ్రీకొడుకు దుర్మరణం
రాయచూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన నగర పరిధిలోని యరమరస్ బైపాస్ రోడ్డులో సోమవారం చోటు చేసుకుంది. మృతులను యరమరస్‌కు చెందిన నరసప్ప(65), రమేష్(35)లుగా పోలీసులు గుర్తించారు. హీరోహోండా ద్విచక్రవాహనం వద్ద మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీ అదుపు తప్పి ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు.
స్థాయి సమితి అధ్యక్ష స్థానం బీజేపీ కై వసం
స్థాయి సమితి అధ్యక్ష స్థానం బీజేపీ కై వసం
స్థాయి సమితి అధ్యక్ష స్థానం బీజేపీ కై వసం


