వేధిస్తున్న నకిలీ విత్తనాల బెడద
రాయచూరు రూరల్: ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతుల ముఖాల్లో కళ లేదు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాలు కరువు ప్రాంతాలుగా మారాయి. రాయచూరు, కొప్పళ జిల్లాల్లో నదుల్లో నీరు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో కృష్ణా, భీమా నదులున్నా నీరందక రైతుల భూముల్లో వేసుకున్న జొన్న పంట వాడుముఖం పట్టింది. పొలంలో బోరుబావుల ద్వారా పంటలు పండించాలంటే భూగర్భ జలాల నీటిమట్టం కుదించుకుపోయింది. మరో వైపు విద్యుత్ కోతలు అధికమయ్యాయి. రాయచూరు జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదులున్నా వ్యవసాయ పనులు లభించక దేశాటన తప్పడం లేదు. మరో వైపు నకిలీ విత్తనాలను పొలంలో వేసిన రైతులు జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో జొన్న, లక్షా 50 వేల ఎకరాల్లో పత్తి, 1.86 లక్షల ఎకరాల్లో మిరప పంటలు వేశారు. ఈ ప్రాంతాల నుంచి ఎన్నికై న ప్రజా ప్రతినిధులు మౌనం వహించారు. అధికారం కోసం తహతహలాడే నేతలు రైతన్నలు పడుతున్న బాధలను తీర్చడంలో మౌనం వహిస్తున్నారు. ఏడు జిల్లాల నుంచి 1963 విత్తన నమూనాలను పరీక్షలకు పంపారు. వాటిలో 63 కంపెనీల విత్తనాలు నాసిరకమని బయట పడ్డాయి. విజయ నగర జిల్లాలో 30 కంపెనీల విత్తనాలు నాసిరకంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. కొప్పళ జిల్లాలో 287 రకాల విత్తనాల్లో 13 కంపెనీలు నాసిరకం, బళ్లారి జిల్లాలో 359 రకాల విత్తనాల్లో 30 కంపెనీలు నాసిరకం, రాయచూరు జిల్లాలో 242 రకాల విత్తనాల్లో 4 కంపెనీలు నాసిరకం, కలబుర్గి జిల్లాలో 251 రకాల విత్తనాల్లో 1 కంపెనీ నాసిరకం, యాదగిరి జిల్లాలో 146 రకాల విత్తనాల్లో 3 కంపెనీలు నాసిరకం, బీదర్ జిల్లాలో 288 రకాల విత్తనాల్లో 6 కంపెనీలు నాసిరకమైనవని తేలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
3 లక్షల ఎకరాల్లో జొన్న పంటకు నష్టం
దిక్కుతోచని స్థితిలో కళ్యాణ కర్ణాటక ప్రాంత రైతులు
వేధిస్తున్న నకిలీ విత్తనాల బెడద


