ఎద్దుల బండిని ఢీకొన్న బస్సు
విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మండల పరిధిలోని పెద్ద కొట్టాలపల్లి సమీపంలో 42వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ప్రైవేట్ బస్సు ఎద్దుల బండిని ఢీకొట్టడంతో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందగా, అదే బండిపై ప్రయాణిస్తున్న రైతుకు తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. పెద్ద కొట్టాలపల్లి గ్రామానికి చెందిన ఎర్రిస్వామిరెడ్డి అనే రైతు తన ఎద్దుల బండిని తోలుకొని వ్యవసాయ పనుల నిమిత్తం మాళాపురం వైపు వెళ్తున్నాడు. అదే మార్గంలో వస్తున్న పీఎస్‌ఆర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అతివేగంగా దూసుకొచ్చి ఎద్దుల బండి ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు బండి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ పొలంలోకి ఎగిరి పడిపోయి ముక్కలై పోయింది. రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. రైతు ఎర్రిస్వామి రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిని వ్యక్తిని స్థానికులు వెంటనే అనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. రెండు ఎద్దులు, బండి కలిపి దాదాపు ఖరీదు రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని బంధువులు వాపోయారు. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని బస్సును సీజ్ చేశారు.
ప్రమాదంలో రెండు ఎద్దులు
అక్కడికక్కడే మృతి
తునాతునకలైన బండి,
రైతుకు తీవ్ర గాయాలు
ఎద్దుల బండిని ఢీకొన్న బస్సు


