రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలా ఆ ఇద్దరి తీరు
సాక్షి,బళ్లారి: రష్యా, ఉక్రెయిక్ మధ్య జరిగిన యుద్ధానికి విరామం ఏ విధంగా జరిగిందో, మళ్లీ మూడు నెలల తర్వాత బాంబులు వేసుకున్నారని, అదే తరహాలో సీఎం కుర్చీ కోసం ఈ ఇద్దరి మధ్య మళ్లీ రాజకీయ సమరం జరిగే అవకాశం ఉందని మాజీ మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. రెండున్నరేళ్ల సీఎం పదవి కోసం సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మధ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌తో కదన విరామం జరిగిందని, అయితే వారిద్దరి మధ్య మళ్లీ ఏ సందర్భంలోనైనా అసమ్మతి నెలకొనే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఓ వైపు సీఎం, డీసీఎంలు పాలనను గాడిలో పెట్టకుండా కుర్చీ కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర కర్ణాటక పరిధిలో రైతులు అతివృష్టి, అనావృష్టితో సతమతవుతున్నా ఇదేమీ వారికి పట్టడం లేదన్నారు. అభివృద్ధి పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నాయకత్వ మార్పిడి గురించే ఆలోచన చేస్తున్నారన్నారు. కొందరు సీఎంకు మద్దతుగా, మరికొందరు డీసీఎంకు మద్దతుగా ఎవరికి వారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసమ్మతితో రాజకీయం మళ్లీ ఎప్పుడైనా పూర్తిగా విజృంభిస్తుందన్నారు.


