నిర్బంధ, ఉచిత విద్య పిల్లలకు అందించాలి
● న్యాయమూర్తి సుబ్రహ్మణ్య
హొసపేటె: అక్షరాస్యతలో కేరళను అధిగమించే స్థాయిలో వివిధ రాష్ట్రాలు విద్యా పురోగతిని సాధించాల్సిన అవసరం ఉందని, నిర్బంధ, ఉచిత విద్యా చట్టం ప్రకారం ఏ ఒక్క బిడ్డ కూడా విద్యకు దూరం కాకూడదని చీఫ్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సుబ్రహ్మణ్య అన్నారు. శుక్రవారం నగరంలోని మహిళా సమాజ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఆడిటోరియంలో తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీ, బార్ అసోసియేషన్, పోలీస్, విద్యా, సాంఘిక సంక్షేమ, రెవెన్యూ, మహిళా, అభివృద్ధి, తాలూకా పంచాయతీ, కార్మిక, ఆరోగ్య, సమాచార, ప్రజా సంబంధాల శాఖల సహకారంతో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్– 21ఏ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరూ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉచిత, నిర్బంధ విద్యకు అర్హులని అన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలు ఏ పాఠశాలలోనైనా విద్యనభ్యసించవచ్చు. కులం, మతం, లింగం, ఇతర కారణాల ఆధారంగా పిల్లలకు చదువుకునే హక్కును తిరస్కరించకూడదన్నారు.
అన్ని రంగాల్లో కేరళ పురోగతి
కేరళలో అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది. నిరుద్యోగ సమస్య చాలా తక్కువగా ఉంది. కేరళ అక్షరాస్యతలో మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో కూడా పురోగతిని సాధించిందన్నారు. దీనికి కారణం విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమేనన్నారు. పిల్లలకు విద్యాపరంగా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. కేరళను ఆదర్శంగా తీసుకొని పిల్లల సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని ఇతర రాష్ట్రాలు నిర్బంధ విద్యా చట్టాన్ని పారదర్శకంగా అనుసరించాలన్నారు. పాఠశాల ప్రాంగణం నుంచి 200 మీటర్ల పరిధిలో పొగాకు, మద్యం, మాదక ద్రవ్యాల అమ్మకాలను నిషేధించారన్నారు. ప్రధాన సివిల్ న్యాయాధీశులు ప్రశాంత్ నాగలాపూర్, జిల్లా విద్యాధికారి వెంకటేష్ రామచంద్రప్ప, బీఈఓ శేఖర్ హొరపేటె తదితరులు పాల్గొన్నారు.


