బెళగావి సమావేశాల నాటికి రాష్ట్రానికి కొత్త సీఎం
హొసపేటె: బెళగావి సమావేశాల నాటికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తారు. ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కాలేరని మాజీ మంత్రి బీ. శ్రీరాములు జోస్యం చెప్పారు. విజయనగర జిల్లాలోని కూడ్లిగిలో పర్యాటక మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రకటన చేశారు. నవంబర్‌లో ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారనేది ఓ కల అని అన్నారు. డీకే.శివకుమార్ ప్రస్తుతం కేపీసీసీ అధ్యక్షుడితో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4–5 మంత్రిత్వ శాఖలతో ఆయనకు దండిగా అధికార బాధ్యతలు ఉన్నాయన్నారు. వాటిని కొనసాగిస్తూనే 2028 వరకు ఎట్టి పరిస్థితుల్లోను డీకే.శివకుమార్ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. కాంగ్రెస్ ఆయనను ముఖ్యమంత్రిని కానివ్వదు. మూడో వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఆ వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకు త్వరలో సమాధానం లభిస్తుందని ఆయన అన్నారు. మీ కులానికి మద్దతు ఇస్తారా? అహిందకు చెందిన నాయకుడు సతీష్ జార్కిహోళికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే మీకు సమ్మతమేనా? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ సతీష్ జార్కిహోళి ముఖ్యమంత్రి అయితే సంతోషమే అన్నారు. సతీష్ తమ ఉత్తర కర్ణాటకకు చెందినవాడని, ఈ ప్రాంత జిల్లాలు ప్రభావితం అవుతాయనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఒక వేళ నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే మధ్యంతర ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాజీ అధ్యక్షుడు చెన్నబసవనగౌడ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీరాములు జోస్యం


