సమస్యలు వెలికి తీయడం మీడియా బాధ్యత
బళ్లారిఅర్బన్: ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకురావడంలో మీడియా పాత్ర అనన్యం అని ఎన్‌సీసీబీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేఎస్ మురళీధర్, జిల్లా పంచ గ్యారంటీ పథకాల అమలు సమితి అధ్యక్షుడు కేఈ చిదానందప్ప పేర్కొన్నారు. నగరంలోని పోలా హోటల్ పార్కింగ్ సభాంగణంలో నేషనల్ క్రైమ్ కంట్రోల్ బోర్డ్(ఎన్‌సీసీబీ), జీటీవీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కన్నడ రాజోత్సవ ప్రశస్తి, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చిట్ట చివరి లబ్ధిదారులకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేర్చే గురుతర బాధ్యత మీడియాదే అన్నారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సూపర్ కన్నడ సమాజ సేవా రత్న ప్రశస్తులను అందించారు. విశేషంగా కళా రత్న ప్రశస్తిని టీహెచ్‌ఎం బసవరాజుకు, విద్యా రత్న ప్రశస్తిని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కే.హనుమంతప్పకు, ఇతరులకు ఉత్తమ సమాజ సేవా రత్న ప్రశస్తులను అందించారు. రైస్ ఆఫ్ ఇమ్యూనిటీ ట్రస్ట్ సంస్థాపక అధ్యక్షుడు, కార్పొరేటర్ ఆసిఫ్ సాంస్కృతిక నృత్య పోటీలలో ప్రథమ రూ.10,000 ద్వితీయ రూ.7,000, తృతీయ రూ.5,000, ఇతర బహుమతులు రూ.వెయ్యి చొప్పున అందించి సర్టిఫికేట్ ఆఫ్ షీల్డ్ కూడా అందించారు. పోలా హోటల్ యజమాని ప్రవీణ్, క్రైమ్ న్యూస్ ఛానల్ వీఎన్ హిరేమఠ, కాంగ్రెస్ ప్రముఖులు పూజారి గాదెప్ప, బోయపాటి విష్ణు, జీకే ఫౌండేషన్ అధ్యక్షుడు విజ్జి జీకే స్వామి, కరవే జిల్లా అధ్యక్షులు హులుగప్ప, ఏకీకరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పీ శేఖర్, జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షుడు బీసీ రమణ, డాక్టర్ బారికె చంద్రశేఖర్, గోపాల్, డాన్స్ మాస్టర్ సన్నీ పాల్గొన్నారు.


