నేటి నుంచి రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు
హొసపేటె: నగరంలో ఈనెల 7, 8, 9వ తేదీల్లో మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే కే.నేమిరాజ్ నాయక్ అధికారులకు సూచించారు. బుధవారం నగరంలో జరిగిన జిల్లా, తాలూకా స్థాయి అధికారుల సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ఈ టోర్నీలో రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి 17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 1400 మంది పోటీదారులు పాల్గొంటారన్నారు. తన దృష్టికి తేకుండా హఠాత్తుగా క్రీడా కార్యక్రమం నిర్వహించడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా భోజన, వసతి, వాహన ఏర్పాట్ల గురించి పూర్తి సమాచారం లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఆయన ఆదేశించారు. గతంలో అనేక క్రీడా కార్యక్రమాల్లో బీఎంఎం కంపెనీ భోజన వ్యవస్థ కల్పించినందున ఆ కంపెనీనే ప్రస్తుతం కూడా ఆ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. రవాణా వ్యవస్థ కోసం వివిధ ఫ్యాక్టరీలు, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులతో పాటు కేఎస్‌ఆర్‌టీసీతో మాట్లాడి అవసరమైన ఖర్చులు చెల్లించి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. సమీపంలోని మొరార్జీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వసతి కోసం ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణ, డీడీపీఐ వెంకటేష్ రామచంద్రప్ప, అసిస్టెంట్ కమిషనర్ వివేకానంద, తహసీల్దార్ శృతి ఎం.మల్లప్పగౌడ్ర, హగరిబొమ్మనహళ్లి సీఐ వికాస్ లమాణి, ఇతర జిల్లా, తాలూకా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


