పతాక స్థాయికి చెరుకు రైతుల పోరాటం
సాక్షి,బళ్లారి: చెరుకు రైతుల ఆందోళన రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో చెరుకు పండించిన రైతన్నలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు చేపడుతున్న ఆందోళన 8వ రోజుకు చేరింది. రాష్ట్రంలో ఎక్కువ శాతం చెరుకు సాగు చేసే బెళగావి, విజయపుర, బాగలకోటె జిల్లాలకు చెందిన రైతుల ఆందోళన తీవ్రతరం కావడంతో రోడ్లు దిగ్బంధనం చేస్తూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని ప్రతిపక్షాలు సైతం వెన్నుదన్ముగా నిలుస్తున్నారు. చెరుకు రైతులు చేపట్టిన ఆందోళనతో బెళగావి జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు చేరడంతో ఆయా రోడ్లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే ఆగిపోతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు చెరుకు రైతుల విషయంలో ఎవరికి వారు మద్దతు ఇస్తున్నామని చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ఆ పార్టీకి చెందిన నాయకులు ఆందోళనలో పాల్గొనడం మంచిదే కానీ వారు సమస్యలను కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లకూడదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తామేమీ సూచించడం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు పేర్కొనడం కూడా గమనార్హం.
కేంద్రం దృష్టికి సమస్య తీసుకెళ్లాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర రైతుల పోరాటంలో పాల్గొనడం కంటే కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని మంత్రి శివానంద పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం బెళగావి జిల్లా గుర్లాపూర్‌లో జాతీయ రహదారి దిగ్బంధనం చేయడానికి ఆయా రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో చెరుకు రైతుల సమస్యల పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ మెట్టు దిగి వచ్చింది. క్వింటాల్‌కు రూ.3200ల ధర ప్రకటించిన నేపథ్యంలో చక్కెర ఫ్యాక్టరీల యజమానులతో చర్చించి టన్నుకు రూ.3500 ప్రకటించే వరకు తాము ఆందోళనను విరమించేది లేదని రైతు నేతలు హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి శివానంద పాటిల్ బెళగావికి చేరుకున్నారు. రైతు సంఘం నాయకులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతులు నిజాయితీతో తమ సమస్యలను పరిష్కరించేందుకు ఆందోళన, నిరసన తెలియచేయడం సంతోషం అని చక్కెర శాఖ మంత్రి శివానంద పాటిల్ పేర్కొంటూ బెళగావితో పాటు బెంగళూరులో చక్కెర ఫ్యాక్టరీల యజమానులతో సమావేశానికి ముఖ్యమంత్రి తగిన చొరవ తీసుకుంటున్నారన్నారు.
నిరం తరరాయంగా ఆందోళన తగదు
రైతులు ఆందోళన చేయడం సబబేనని అయితే నిరంతరాయంగా కొందరు రాజకీయ లబ్ధి కోసం ఆందోళనలను ముందుకు సాగించడంలో అర్థం లేదన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం రైతుల తరపున పోరాటం, ఆందోళన చేస్తున్న వారిని గుర్తిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జరిపే సమావేశంలో చెరుకు రైతులకు వారి కోరిక మేరకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితిలోను జాతీయ రహదారులను బంద్ చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదని మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలో చెరుకు రైతుల ఆందోళనపై మంత్రి స్పందించడంతో రైతులు నేడు జరపనున్న జాతీయ రహదారుల బంద్ కార్యక్రమం ఏ మేరకు ప్రభావితం చేస్తోందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే చెరుకు రైతులు రోడ్లపై వంటవార్పు చేసుకుంటూ అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. చెరుకు రైతుల ఆందోళనకు బీజేపీ మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొని చెరుకు రైతులకు బాసటగా నిలుస్తోంది. దీనిపై సీఎం, సంబంధిత మంత్రులతో బెంగళూరులో నిర్వహించే సమావేశంలో రైతులకు శుభ సూచనలు అందే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
8 రోజులుగా రహదారులన్నీ బంద్
నిరసన తెలియచేస్తున్న అన్నదాతలు
నేడు జాతీయ రహదారి దిగ్బంధించవద్దు: మంత్రి శివానంద పాటిల్ మనవి
పతాక స్థాయికి చెరుకు రైతుల పోరాటం


