వేడుకగా గురునానక్ జయంతి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని బీదర్‌లో బుధవారం వేలాది మంది భక్తుల సమక్షంలో గురుద్వారాలో గురునానక్ 556వ జయంతిని, రథోత్సవాన్ని వైభవంగా జరిపారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా భక్తిశ్రద్ధలతో గురునానక్ విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపి ఊరేగించారు. సిక్కులు తమ సంప్రదాయ నృత్యంతో చూపరులను ఆకట్టుకున్నారు. భావైక్యతను చాటి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. చిన్నారులు సిక్కుల వేషధారణలలో సంభ్రమాశ్చర్యంలో మునిగారు.
అకాల వర్ష బీభత్సం.. వరి పైరుకు నష్టం
రాయచూరు రూరల్: అకాల వర్ష బీభత్సంతో జిల్లాలో కోతకొచ్చిన వరి పైరుకు నష్టం వాటిల్లింది. దేవదుర్గ, సింధనూరు తాలూకాల్లో వేలాది ఎకరాల్లో పంట నేలకొరిగింది. గురువారం రెండు తాలూకాల్లో కురిసిన వర్షాలకు రైతుల నోటిలో మట్టిపడినట్లయింది. సింధనూరు తాలూకా రౌడకుంద, జవళగేర, రాగలపర్వి, బూదిహాళ క్యాంప్, హుడా, గొరేబాళ్, సోమలాపుర తదితర ప్రాంతాల్లో పంటకు నష్టం జరిగింది. దేవదుర్గ తాలూకా జాలహళ్లి, చప్పళికి తదితర ప్రాంతాల్లో రైతులు వేసుకున్న వరి పంట చేతికొచ్చే సమయంలో వరుణ దేవుడు కాటు వేశాడని రైతులు అయోమయంలో పడ్డారు.
అత్యాచార నిందితుడికి జైలుశిక్ష
● మైనర్ చెల్లిపై లైంగిక దాడి
● మగబిడ్డను ప్రసవించిన బాలిక
హుబ్లీ: ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన మైనర్ చెల్లెలిపై నిరంతరంగా అత్యాచారం చేసిన నిందితుడికి తాజాగా పోక్సో కేసులో జైలు శిక్ష విధించారు. ఇక గర్భవతి అయిన ఆ బాలిక వారం రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. గత అక్టోబర్ 26న ఉదయం ఇంటి పని చేసేటప్పుడు బాలిక జారిపడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు బాలిక వెన్నుపై గాయం అయిందని స్క్యానింగ్ చేయాలని సూచించారు. ఆ మేరకు గత నెల 30న కొప్పళ జిల్లా ఆస్పత్రిలో స్క్యానింగ్ చేసి కడుపులో బిడ్డ ఉందని నిర్థారించారు. అయితే ఆ బాలిక తాను గర్భిణి అయిన విషయం తనకు తెలియదని పేర్కొంది. కాగా సొంత అన్నే ఆమైపె అఘాయిత్యానికి పాల్పడినట్లు కొప్పళ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఉద్యోగాల భర్తీ కోసం సంతకాల సేకరణ
రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని ఒత్తిడి చేస్తూ ఏఐడీవైఓ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు కదం తొక్కారు. గురువారం రాయచూరు తహీసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర కార్యదర్శి చెన్నబసవ మాట్లాడారు. నిరుద్యోగులకు వయస్సు మీరుతున్న తరుణంలో రిజర్వేషన్ ప్రక్రియ ముగిసే వరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిలిపి వేయడం తగదన్నారు. ఏడాదికోసారి నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించుకొని కాలం గడపడాన్ని తప్పుబడుతూ సంతకాల సేకరణ చేపట్టారు.
అంగన్‌వాడీ కార్యకర్తలకు
పెన్షన్ అందించాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలకు, సహాయకులకు పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం డిమాండ్ చేసింది. గురువారం దేవదుర్గ తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు రంగమ్మ మాట్లాడారు. 2011 నుంచి 2023 వరకు పదవీ విరమణ చేసిన 10,311 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు, 11,980 మంది సహాయకులకు కలిపి మొత్తం రూ.183 కోట్లు ఆర్ధిక శాఖ నుంచి విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. ప్రావిడెంట్ ఫండ్, గ్రాచ్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లను పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
వేడుకగా గురునానక్ జయంతి
వేడుకగా గురునానక్ జయంతి


