ఎడమ కాలువ కింద రెండో పంటకు నీరివ్వండి
రాయచూరు రూరల్ : తుంగభద్ర ఎడమ కాలువ కింద రెండో పంటకు నీరందించాలని మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, మాజీ ఎంపీ విరుపాక్షప్ప డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి బెంగళూరులో వికాససౌధలో రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజును కలిసి మాట్లాడారు. రబీ పంటలకు నీరందించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల అమరికకు డ్యాంలో 50 టీఎంసీల నీరున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు సూచిస్తున్నారన్నారు. ఈ విషయంలో రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయ నగర జిల్లాల్లోని ఇంచార్జి మంత్రులు, శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు కలిసి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలన్నారు.
అనాథ పిల్లలకు నామకరణం
రాయచూరు రూరల్ : నగరంలో అనాథ పిల్లలకు అధికారులు నామకరణ కార్యక్రమం చేపట్టారు. గురువారం నగరంలోని జిల్లా మహిళా రక్షణ ఘటకం, జిల్లా పిల్లల కళ్యాణ సమితి, పిల్లల పాలన సంస్థ ఆవరణలో శాస్త్రోక్తంగా ఇద్దరు పిల్లలకు పేర్లు పెట్టారు. రెండు నెలల కిందట కల్మల వద్ద దొరికిన మగ బిడ్డ దేవదుర్గ తాలూకా గోపాలపురలో ఆడ బిడ్డలను తొట్టెలో వేసి నామకరణం చేశారు. జిల్లా మహిళా రక్షణ ఘటక అధ్యక్షురాలు మంగళ హెగ్డే, జిల్లా పిల్లల కళ్యాణ సమితి అధ్యక్షుడు సుదర్శన్, పిల్లల పాలన సంస్థ అధికారి భారతి నాయక్, రాధాబాయి, నాగరాజ్, శేఖ్ మెహబూబ్‌లున్నారు.
రూ.కోటి అవినీతిపై విచారణ
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా శాఖవాది గ్రామ పంచాయతీలో రూ.కోటిపైగా నిధుల అవినీతిపై విచారణ చేపట్టారు. గురువారం పంచాయతీ కార్యాలయంలో జెడ్పీ ఆధ్వర్యంలో ఒంబుడ్స్‌మెన్ పుష్ప విచారణ చేశారు. గ్రామ పంచాయతీలో 2021–22లో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మంజూరైన నిధులను పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓలు) పనులు చేపట్టకుండానే నిధులను దిగమింగారనే ఆరోపణలపై విచారణ చేశారు. పీడీఓలు అణ్ణారావ్, విజయ కుమార్ ప్రైవేట్ స్థలంలో గోదాము, విశ్రాంతి గది, రక్షణగోడ, ఇతర పనులు చేశారని, చెరువులో పూడిక తీయకుండా, వ్యవసాయ నీటి గుంటలు తవ్వకుండా నిధులు కాజేశారని విచారణలో బయట పడింది.
కన్నడ భాషను ప్రోత్సహించాలి
రాయచూరు రూరల్: పట్టణ ప్రాంతాల్లో కన్నడ భాషకు ప్రోత్సాహమివ్వాలని కిల్లె బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య స్వామి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రంగకుసుమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. తెలుగు, కన్నడలను కలిపి వ్యాఖ్యానించడం, మాట్లాడడం జరుగుతోందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కన్నడకు అధిక ప్రాధాన్యత కల్పించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, సాయి కిరణ్, సిద్దేశ్ విరక్తి మఠ, అరుణ్‌లున్నారు.
శ్రీవారికి పల్లకీ సేవ
రాయచూరు రూరల్ : నగరంలో మూడు రోజుల పాటు జరుగుతున్న శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా గురువారం నగరంలోని నవోదయ వైద్య కళాశాల ఆవరణలో వెలసిన వేంకటేఽశ్వర స్వామి వారికి పల్లకీ సేవ నిర్వహించారు. స్వామి వారి పవిత్రోత్సవ సేవల్లో నారాయణపేట మాజీ శాసన సభ్యుడు ఎస్.రాజేంద్రరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉదయం సుప్రభాత సేవ, పరిమళ ఆరాధన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నెరవేర్చారు.
విజ్ఞానంపై ఆసక్తి పెంచాలి
కేజీఎఫ్ : విద్యార్థుల్లో వైజ్ఞానిక భావనలు పెంపొందించి వారిలో దాగిన సృజనాత్మకతను బయటకు తీయాలని నగరసభ కమిషనర్ ఆంజనేయులు ఉపాధ్యాయులకు సూచించారు. కేజీఎఫ్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన జాతీయ ఆవిష్కార్ అభియాన్, సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సైన్స్‌పై పిల్లలకు ఆసక్తి పెంచితే శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంద్నారు. కాగా విద్యార్థులు రాకెట్, డ్రోన్, స్మార్ట్‌సిటీ తదితర నమూనాలను ప్రదర్శించి సృజనను చాటారు. వైస్ ప్రిన్సిపాల్ దినేష్, శ్రీనివాస్, రవిచంద్ర నాయుడు పాల్గొన్నారు.
ఎడమ కాలువ కింద రెండో పంటకు నీరివ్వండి
ఎడమ కాలువ కింద రెండో పంటకు నీరివ్వండి
ఎడమ కాలువ కింద రెండో పంటకు నీరివ్వండి


