రెండో పంటకు నీరందించండి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు కింద రెండో పంటకు నీరందించాలని రైతు సంఘం గౌరవాధ్యక్షుడు చామరస మాలి పాటిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ పంటకు నీరు అందించడానికి డీసీఎం అంగీకరించక పోవడాన్ని తప్పు బట్టారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల అమరిక విషయంలో డ్యాంలో 50 టీఎంసీల నీరున్నా గేట్ల ఏర్పాటుకు ఎలాంటి నష్టం లేదన్నారు. రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయ నగర జిల్లాల్లోని ఇంచార్జి మంత్రులు, శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు కలిసి ముఖ్యమంత్రిని కలిసి తుంగభద్ర ఎడమ కాలువ కింద రబీ సీజన్‌కు నీరు వదలాలని కోరాలన్నారు. 70 ఏళ్ల నాటి అక్విడక్ట్‌లు, రహదారులు, డిస్ట్రిబ్యూటర్ల మరమ్మతులు చేపడతామంటే రైతులు రెండవ పంటను వదులుకోడానికి సిద్ధమన్నారు. డ్యాం క్రస్ట్‌గేట్ల అమరిక కోసం రైతులు రబీ పంటను వదులుకోవడం సాధ్యం కాదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలన్నారు. మాజీ శాసన సభ్యుడు గంగాధర నాయక్, రైతు నేతలు బూదయ్య స్వామి, ప్రభాకర్ పాటిల్, జాన్ వెస్తీలున్నారు.


