ఓటీపీ, మోసపూరిత లింక్‌లతో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

ఓటీపీ, మోసపూరిత లింక్‌లతో జాగ్రత్త

Oct 26 2025 8:35 AM | Updated on Oct 26 2025 8:35 AM

ఓటీపీ

ఓటీపీ, మోసపూరిత లింక్‌లతో జాగ్రత్త

ఓ టెక్కీ సంపాదన చాలక పార్ట్‌ టైం జాబ్‌ చేయాలనుకున్నాడు. ఇంటర్నెట్‌లో గాలించగా ఓ లింక్‌ దొరికింది. దానిని క్లిక్‌ చేయగానే ఫోన్‌ ఖరాబైంది. ఖాతాలోని రూ.లక్షకు పైగా నగదు దుండగుల ఖాతాకు బదిలీ అయ్యింది.

మ్యాట్రిమొని వెబ్‌సైట్‌లో రెండో పెళ్లి కోసం ఓ మహిళ వివరాలను నమోదు చేసుకుంది. అమెరికాలో ఇంజనీరునంటూ ఓ మోసగాడు ఆమెకు వలవేశాడు. తీయని మాటలు చెప్పి మూడేళ్లలో రూ.2 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరిగింది.

ఇలా చెప్పుకుంటూ పోతే సిలికాన్‌ రాజధానిలో జరుగుతున్న ఆన్‌లైన్‌ నేరాలకు అంతం లేదు. నగరవాసులకు బతిమాలి, బెదిరించి సైబర్‌ వంచకులు నిండా ముంచుతున్నారు. ఏటా వందల కోట్ల రూపాయలను ఇలా దోచేస్తున్నారు. పోలీసులు ఛేదిస్తున్నవి చాలా తక్కువ కేసులే.

దేశంలో అత్యధిక సైబర్‌ నేరాలు జరుగుతున్న నగరాల్లో బెంగళూరు ఒకటి

దొడ్డబళ్లాపురం: సైబర్‌ క్రైం కేసుల్లో బెంగళూరు రూరల్‌ జిల్లా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. విచిత్రం ఏమిటంటే సైబర్‌ ౖక్రైం బాధితుల్లో చాలామంది విద్యావంతులే కావడం. బెంగళూరు తరువాత బెంగళూరు రూరల్‌ జిల్లా ప్రజలను ఎక్కువగా సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ఆన్‌లైన్‌ నేరాల్లో కూడా రాజధాని అగ్రస్థానంలో కొనసాగడం ఓ రకంగా పోలీసు శాఖకే అప్రతిష్టగా మారిందనే విమర్శలున్నాయి.

ఎలాంటి నేరాలు అంటే

ఉద్యోగాలు, పార్ట్‌ టైం ఉద్యోగాలు, తక్కువ సమయంలో డబ్బులు రెట్టింపు చేస్తామని, షేర్లలో పెట్టుబడి, ప్రభుత్వ పథకాల మంజూరు, పెళ్లి సంబంధాలు, డిజిటల్‌ అరెస్టు పేరుతో ఎక్కువగా సైబర్‌ నేరాలు, మోసాలు జరుగుతున్నాయి. అమాయకుల నుంచి లక్షల రూపాయలను తమ అక్కౌంట్‌లలోకి బదిలీ చేయించుకుంటున్నారు సైబర్‌ నేరస్తులు.

సిటీ, సౌత్‌లో అత్యధికం

● బెంగళూరు సిటీ, దక్షిణ బెంగళూరు ప్రాంతాల్లో అత్యధింగా సైబర్‌ క్రైం కేసులు నమోదవుతున్నాయని పోలీసులు తెలిపారు. నెల నెలా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

● బెంగళూరు గ్రామీణ జిల్లాలో నెలకు సరాసరి 35 కేసులు వస్తుంటే, 6 నెలలకు 210 కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులను దర్యాప్తు చేసే సైబర్‌ క్రైం స్టేషన్‌ బెంగళూరులోనే ఉంది.

● ముఖ్యంగా ఇన్‌స్టా, వాట్సాప్‌, టెలిగ్రాం, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు మోసగాళ్లు వల వేస్తున్నారు.

● నష్టపోతున్న వారిలో ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్‌లు, ప్రభుత్వ ఉద్యోగులు, టెక్కీలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు.

● ఆన్‌లైన్‌ షాపింగ్‌, బ్యాంకింగ్‌, నగదు లావాదేవీలు చేసేవారు సులభంగా బలైతున్నారు.

పేరుకుపోతున్న కేసులు

బెంగళూరు గ్రామీణ జిల్లాలో సైబర్‌ క్రైం స్టేషన్‌ లేకపోవడంతో జిల్లాలో నమోదయ్యే కేసులను బెంగళూరుకు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే వేలాది కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి, కొత్తగా వచ్చేవాటిని దర్యాప్తు చేయడం, నేరగాళ్లను పట్టుకోవడం ఆలస్యమవుతోంది.

సులభంగా మోసపోతున్న నగరవాసులు

బెంగళూరులోని ఓ సైబర్‌ ఠాణాలో రద్దీ

కొల్లగొడుతున్న ఆన్‌లైన్‌ వంచకులు

బెంగళూరు, బెంగళూరు రూరల్‌కు తొలి, రెండవ స్థానాలు

ఖాకీలకు పెను సవాల్‌

సైబర్‌ క్రైం నేరాలపై మాట్లాడిన బెంగళూరు రూరల్‌ జిల్లా ఏఎస్పీ నాగరాజు ఓటీపీ షేర్‌ చేయడం వల్ల, ఆన్‌లైన్‌లో వచ్చే లింక్‌లు క్లిక్‌ చేయడం వల్ల మోసాలు జరుగుతున్నాయి. సోషల్‌ మీడియా ద్వారా నేరస్తులు బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు, జిల్లాలో అన్ని తాలూకాల్లో పారిశ్రామిక వాడలు ఎక్కువగా ఉండడం వల్ల ఆన్‌లైన్‌ నేరాలూ ఎక్కువైనట్లు చెప్పారు. సైబర్‌ క్రైం నివారణ కోసం పోలీసుశాఖ ప్రజల్లో జాగృతిని కలిగించేందుకు కృషి చేస్తోందన్నారు. సైబర్‌ క్రైం బాధితులు నేరుగా 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని కేసుల పరిష్కారానికి బెంగళూరు మిల్లర్స్‌ రోడ్డులో ప్రత్యేక సైబర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఓటీపీ, మోసపూరిత లింక్‌లతో జాగ్రత్త 1
1/2

ఓటీపీ, మోసపూరిత లింక్‌లతో జాగ్రత్త

ఓటీపీ, మోసపూరిత లింక్‌లతో జాగ్రత్త 2
2/2

ఓటీపీ, మోసపూరిత లింక్‌లతో జాగ్రత్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement