కంది పంట వెలవెల.. రైతన్న విలవిల
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలో అధికంగా పండించే కంది(ఎర్రబంగారం) పంట విస్తీర్ణం ఈసారి తగ్గింది. కంది పంటకు పేరొందిన కలబుర్గి డివిజన్‌లో సున్నపు రాళ్లతో కూడిన భూమిలో కంది ఏపుగా పెరుగుతుంది. ఈ పంటను క్యాల్షియం, పొటాషియంతో కూడిన మట్టిలో పండిస్తారు. కలబుర్గి జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో కంది పంట సాగవుతుంది. ఖరీఫ్ సీజన్‌లో అతివృష్టితో అధికంగా ఈదురు గాలులు వీయడంతో కందికి రోగం సోకింది. కంది పంట ఆరు నెలల్లో చేతికి వస్తుంది. కోతకు బిహార్ నుంచి యంత్రాలు వస్తాయి. కల్యాణ కర్ణాటకలోని కలబుర్గి, బీదర్, విజయపుర, యాదగిరి, రాయచూరు, కొప్పళ, గదగ్, బాగల్‌కోటె, బెళగావి, హావేరి, బళ్లారి జిల్లాలో అధికంగా పండిస్తారు. ఇక్కడ పండిన పంటలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రకు తరలిస్తారు. ఏడాదికి కలబుర్గి జిల్లాలో ఎనిమిది లక్షల హెక్టార్లలో పండిస్తుండగా ఈ ఏడాది రెండు లక్షల హెక్టార్ల మేర విస్తీర్ణం తగ్గింది. జీఐఎల్ గుర్తింపు కలిగిన కంది పప్పును ఆస్ట్రేలియా, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది మార్కెట్‌లో కందిపప్పు ధర క్వింటాల్‌కు రూ.12,700 పలికింది. వినియోగదారుడికి కిలో ధర రూ.160–200ల వరకు లభిస్తుంది.
ఏడాదికి రూ.5,500 కోట్ల లావాదేవీలు
కల్యాణ కర్ణాటకలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, బళ్లారి, కొప్పళ, గదగ్, హావేరి, బాగల్‌కోటె, విజయపుర, బెళగావి జిల్లాల్లో పండిన పంట ద్వారా ఏడాదికి రూ.5,500 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం రూ.7,550 మద్దతు ధర ప్రకటించింది. 55 లక్షల క్వింటాళ్ల మేర కొనుగోలు చేయాలని కంది మండలి నిర్ణయం తీసు కుంది. కంది మండలి ఏర్పాటై దశాబ్దం గడిచినా నేటికి సర్కార్ నయా పైసా నిధులు కూడా కేటాయించలేదు.
రోగం బారిన పడిన ఎర్రబంగారం
ఈ సంవత్సరం తగ్గిన సాగు విస్తీర్ణం


