 
															నగల షాపులో మస్కా
● 6 బంగారు గొలుసుల చోరీ
మైసూరు: బంగారం బహుప్రియం కావడంతో దొంగలు తెగబడుతున్నారు. కొనుగోలుదారులా వచ్చి ఓ నగల షాపులో పెద్దమొత్తంలో చైన్లను తస్కరించాడో దొంగ. మైసూరు అశోక రోడ్డులోని దీప్ జువెలర్స్‌లో ఈ ఘటన జరిగింది. వివరాలు... అంగడికి సుమారు 55 ఏళ్ల వ్యక్తి వచ్చి బంగారు, వెండి నాణేలను చూపించాలని అడిగాడు. దీంతో యజమాని రతన్‌లాల్ 20 నాణేలను అతని ముందు ఉంచాడు. వాటిని చూసి పక్కన పెట్టిన ఆ వ్యక్తి 2 గ్రాముల బంగారు నాణేలుంటే చూపించండి, దేవస్థానానికి ఇవ్వాలి, లోపల ఉంటే తీసుకురండి అని చెప్పాడు. రతన్‌లాల్ తమ వద్ద బంగారు నాణేలు లేవు, కావాలంటే తెప్పించి ఇస్తామని చెప్పి బాబు అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. అంతలో ఆ వ్యక్తి బంగారు గొలుసులను చూపించండి అనడంతో కొన్ని గొలుసులను తీశాడు. జైన దేవాలయం స్వామీజీకి ఇవ్వాలని, అందువల్ల మహిళలు తాకని కవర్‌లో ఉంచిన చైన్లను చూపించాలని అడిగాడు. దీంతో రతన్‌లాల్ ఫోల్డింగ్ లెదర్ బ్యాగ్‌లో వివిధ డిజైన్లు ఉన్న 5–6 గొలుసుల ను చూపించారు. ఆ వ్యక్తి ఆ గొలుసులను ఒక్కొక్కటే ప్లాస్టిక్ కవర్‌లో వేసి అంగడిలో పూజా పీఠంలో ఉంచి పండ్ల బ్యాగ్‌లో పెట్టాడు. వీటిని ఇలానే బ్యాగ్‌లో పెట్టి ఉంచండి, మా పిల్లాడు వచ్చి ఒక గొలుసును కొనుగోలు చేస్తాడని చెప్పి రూ.5 వేల నగదు ఇచ్చి వెళ్లాడు. అతను వెళ్లిన తర్వాత రతన్‌లాల్ కవర్‌ను పరిశీలించగా, అందులో 6 గొలుసులు లేవు. లబోదిబోమంటూ లష్కర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
సవతి తండ్రి చేతిలో బాలిక హత్య
బనశంకరి: మారుతండ్రి చేతిలో చిన్నారి పాప బలైంది. తమ సంతోషానికి అడ్డుగా ఉందని పాపను కిరాతకుడు గొంతు పిసికి చంపివేశాడు, ఈ సంఘటన బెంగళూరు పరిధిలోని కుంభళగూడు పోలీస్‌స్టేషన్ పరిదిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు... స్థానిక రామసముద్ర కన్నికా లేఔట్‌లో శిల్పా, కూతురు సిరి (7)తో నివసిస్తోంది. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న శిల్పా భర్త నుంచి విడిగా ఉంటోంది. ఈ మధ్య ఆనేకల్‌లో మార్కెటింగ్ ఉద్యోగం చేసే దర్శన్ అనే వ్యక్తితో శిల్పా కు పరిచయం ఏర్పడి తరువాత పెళ్లి చేసుకున్నారు. సవతి కూతురు సిరి అంటే దర్శన్‌కు నచ్చేది కాదు. మన సంసారంలో సిరి అడ్డుగా ఉందని శిల్పా తో గొడవపడ్డాడు. శుక్రవారం ఉదయం శిల్పా విధులకు వెళ్లింది. సాయంత్రం 5.30 సమయంలో దర్శన్ ఇంటికి వచ్చాడు, సిరి ముఖంపై కొట్టి గొంతు పిసికి చంపి పారిపోయాడు. శిల్పా ఇంటికి వచ్చి చూడగా కుమార్తె శవం కనిపించడంతో తల్లిడిల్లింది. స్థానిక పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్శన్ కోసం గాలిస్తున్నారు.
అవినీతి పెరిగింది: మోహన్‌దాస్
శివాజీనగర: తరచూ విమర్శలతో రాష్ట్ర కాంగ్రెస్ సర్కారును ఇరుకున పెడుతున్న ఐటీ పారిశ్రామికవేత్త మోహన్‌దాస్ పాయ్.. మరోసారి ఎక్స్‌లో ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి గారూ.. మీ శాఖల్లో అవినీతి చాలా అధికమైంది. ఒక్కొక్క శాఖ ఒక్కొక్క వసూలు రేటును పెట్టుకొందని ఆరోపించారు. పరిశ్రమలకు తక్షణ అనుమతులకు మీరు సింగిల్ విండోకు ప్లాన్ చేశారు, ఇది మంచిదే అన్నారు. మీ ఆలోచనకు ధన్యవాదాలు. అయితే అధికారులు ఆ తరువాత అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది, సింగిల్ విండో ఇక్కడ సాధ్యపడదు. ఎందుకంటే శాఖలలో అవినీతి చాలా ఎక్కువైంది అని పేర్కొన్నారు.
 
							నగల షాపులో మస్కా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
