గురుమఠకల్‌లో కవాతుకు బ్రేక్
రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లా చిత్తాపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కవాతు నిర్వహణకు కలబుర్గి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో మరో పిటిషన్ వేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో యాదగిరి జిల్లాధికారి హర్షల్ బోయర్ గురుమఠకల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కవాతుకు బ్రేక్ వేశారు. వారం రోజుల క్రితం చిత్తాపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్, భీమ్ ఆర్మీ కవాతును ఒకే రోజున రెండింటికీ అవకాశం ఇవ్వడం కుదరదని తహసీల్దార్ నాగయ్య హిరేమఠ్ రెండు అర్జీలను తిరస్కరించిన సంగతి విదితమే. దీనిని ఆధారంగా చేసుకొని ఆర్‌ఎస్‌ఎస్ కలబుర్గి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆర్‌ఎస్‌ఎస్‌కు కొన్ని సలహాలు, సూచనలు జారీ చేస్తూ ఏరోజున ఆర్‌ఎస్‌ఎస్ కవాతు చేస్తారు? అనే అంశాన్ని ఉల్లేఖిస్తూ కొత్తగా పిటిషన్ వేయాలని ఆదేశించింది. ఈ విషయంపై కోర్టులో జరిగిన వాదనల అనంతరం విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. మూడు రోజుల క్రితం చేసిన దరఖాస్తును రద్దు చేయడంపై ఆర్‌ఎ్‌స్‌ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరి జిల్లా సురపుర, హుణసగి, శహాపుర, వడగేర, యాదగిరిల్లో కవాతు నిర్వహించారు.
త్రిచక్రవాహనాల పంపిణీ
రాయచూరు రూరల్ : నగరంలో పురాతన పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. శనివారం రూ.కోటితో చేపట్టిన నేతాజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. పెద్దలు పిల్లలను పాఠశాలకు పంపి విద్యాబుద్దులు నేర్పించాలన్నారు. నగరంలోని చంద్ర మౌళేశ్వర సర్కిల్ నుంచి గంజ్ సర్కిల్ వరకు రహదారి అభివృద్ధికి రూ.30 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. నగరంలోని అంబిగర చౌడయ్య నూతన విగ్రహాన్ని పరిశీలించారు. తన కార్యాలయంలో మంత్రి 34 మంది దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందించారు. కార్యక్రమంలో అభినవ రాచోటి శివాచార్యులు, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షుడు సాజిద్, రుద్రప్ప, శాంతప్ప, అమరేగౌడ, జయన్న, రాజు, సుభాష్, నరసింహులు, శాలం, అధికారులున్నారు.
కన్నడ భాష పరిరక్షణకు ఉద్యమం రావాలి
కోలారు: అన్య భాషలు మాట్లాడే వారిని కన్నడం వైపు ఆకర్షించే ప్రయత్నం చేయాలని రాష్ట్ర కన్నడ అభివృద్ధి ప్రాధికార కార్యదర్శి సంతోష్ హానగల్ సూచించారు. కన్నడ భాషాభివృద్ధి– సవాళ్లు అనే అంశంపై నగరంలోని ప్రభుత్వ కళాశాలలో కన్నడ అభివృద్ధి ప్రాధికార, ఆదిమ సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విచార సంకీర్ణంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఉన్నంత కన్నడ భాషాభిమానం మనలో లేకపోవడం విచారకరమన్నారు. కన్నడ అభివృద్ధికి గోకాక్ విప్లవం తరహాలో కన్నడ భాషా ఉద్యమం ప్రారంభించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కన్నడ పర సంఘటనల జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్, కరవే జిల్లా అధ్యక్షుడు మేడిహాళ రాఘవేంద్ర, జయ కర్నాటక సంఘం జిల్లా అధ్యక్షుడు త్యాగరాజ్ పాల్గొన్నారు.
పెళ్లి కాలేదని
వ్యాన్ డ్రైవర్ ఆత్మహత్య
క్రిష్ణగిరి: ఇరవై ఎనిమిది ఏళ్ల వయస్సు వచ్చినా పెళ్లి కాలేదనే బాధతో తాగుడుకు బానిస అయిన వ్యాన్ డ్రైవర్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కురుబరపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు క్రిష్ణగిరి సమీపంలోని గంగోజి కొత్తూరు గ్రామానికి చెందిన బాలాజీకి పలు సంబంధాలు చూసినా పెళ్లి కుదరలేదు. దీంతో తాగుడుకు అలవాటుపడ్డాడు. ఇక పెళ్లి జరగదేమో అని మనస్థాపానికి గురైన బాలాజీ.. శుక్రవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కురుబరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
పోలియో నిర్మూలనకు
సైకిల్ యాత్ర
కోలారు: పోలియో నిర్మూలనకు శ్రమిస్తున్న రోటరీ సంస్థ సీనియర్ సభ్యులు శనివారం కోలారు నగరం నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేపట్టారు. రోటరీ సెంట్రల్ మాజీ అధ్యక్షుడు సిఎంఆర్ శ్రీనాథ్ మాట్లాడుతూ దేశంలో పోలియేను సమూలంగా నిర్మూలించాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఇందుకోసం సైకిల్ యాత్రను ప్రారంభించామన్నారు. అనంతరం సైకిల్ యాత్రికులకు పుష్పగుచ్ఛం అందించి శక్తి వర్ధక పానీయాలను అందించారు. రోటరి అధ్యక్షుడు నాగరాజ్, వలయ కార్యదర్శి ఎస్ సుధాకర్, వలయ అధ్యక్షుడు రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
గురుమఠకల్‌లో కవాతుకు బ్రేక్
గురుమఠకల్‌లో కవాతుకు బ్రేక్


