
నంజేగౌడ శాసన సభ్యత్వం రద్దు కాదు
మాలూరు: హైకోర్టు మాలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రీకౌంటింగ్ చేయాలని ఆదేశించినంత మాత్రాన ఎమ్మెల్యే నంజేగౌడ శాసన సభ్యత్వం రద్దు కాదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని కుప్పశెట్టి బావి సమీపంలో ప్రతిష్టించిన గణేశోత్సవ కార్యక్రమంలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరుగుతున్న 47వ గణేష ఉత్సవాల్లో పాల్గొనడం తనకెంతో సంతోషం కలిగించిందన్నారు. వినాయకుడు అన్ని రకాల విఘ్నాలను తొలగించాలన్నారు. ఎమ్మెల్యే నంజేగౌడ నియోజకవర్గ అభివృద్ధి గురించి తన దృష్టికి తెచ్చారన్నారు. అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వం ఉచిత గ్యారెంటీ పథకాలను ప్రజలకు సక్రమంగా అందిస్తోందన్నారు. 10 కిలోలు ఇస్తున్న బియ్యాన్ని కొంతమంది బయట విక్రయించుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తుండడంతో బియ్యం బదులుగా కంది పప్పు, నూనె, చక్కెర, ఉప్పు అందించడానికి పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే కేవై నంజేగౌడ, మాజీ ఎమ్మెల్యే ఏ.నాగరాజ్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సీ.లక్ష్మీనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాపుర కిట్టణ్ణ తదితరులు పాల్గొన్నారు.