
బాల్య వివాహాలు నియంత్రించాలి
రాయచూరు రూరల్: జిల్లాలో మహిళ, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖలో అధికారులు ఇచ్చిన నివేదికలు వేరు. సభలో వినిపిస్తున్న నివేదికలకు పొంతన లేదని కర్ణాటక విధాన సభ మహిళ, శిశు అభివృద్ధి కళ్యాణ సమితి అధ్యక్షుడు కోన రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన ప్రగతి పరిశీలన సభలో ఆయన మాట్లాడారు. పిల్లల సంరక్షణ విషయంలో 84 కేసులకు గాను కేవలం 64 కేసులను పరిష్కరించి చేతులు దులుపుకోవడం తగదన్నారు. 85 శాతం అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుపుతున్న అంశాలను శాసన సభ్యులు వివరించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్ల నియామకాల్లో అలసత్వంపై సభ్యులు శరణే గౌడ, కరెమ్మ నాయక్ అధికారులపై మండిపడ్డారు. బాల కార్మికులను నియంత్రించడంలో పోలీస్ యంత్రాంగం మౌనం వహించడం తగదన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలని సూచించారు. పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు ఇక్బాల్, శాంతారాం, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, అదనపు కార్యదర్శి మంజుళ, ఐజీపీలు సతీష్ కుమార్, వర్తిక్ కటియార్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్ట మాదయ్య, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ తదితరులు పాల్గొన్నారు.