
దసరా ఆఫర్.. లాఠీచార్జీ
బనశంకరి: దుస్తులు తక్కువ రేటు అని ఆఫర్ ఇవ్వడంతో ఒక్కసారి కస్టమర్లు దుకాణంలోకి ఎగబడటంతో తొక్కిసలాట నెలకొంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటన హాసన్ నగర ఉదయగిరి లేఔట్‌లో జరిగింది. లక్ష్మీ బ్యాడ్మింటన్ అకాడమి భవనంలో ఓ షాపులో దసరా ఆఫర్‌ని ప్రకటించారు. ఆదివారం భారీగా యువకులు రావడంతో తొక్కిసలాట ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి చెదరగొట్టారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
కేరళ విద్యార్థుల
గంజాయి దందా
బనశంకరి: గంజాయి భూతం విద్యార్థులు, యువత మీద పంజా విసురుతోంది. ఆదివారం మంగళూరు దక్షిణ పోలీసులు ఓ ఫ్లాటులో సోదాలు చేయగా 12 కేజీల గంజాయి లభించింది. అందులో ఉంటున్న 11 మంది కేరళ విద్యార్థులను అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌కుమార్ రెడ్డి వివరాలను వెల్లడించారు. అత్తావర కాపీగుడ్డ మసీదు వద్ద గల కింగ్స్ కోర్ట్ అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో గంజాయిని అమ్ముతున్నట్లు తెలిసింది. వెంటనే పోలీసులు దాడిచేశారు. 11 మంది బీబీఏ విద్యార్థులను అరెస్టు చేశారు. వీరు మంగళూరు కాలేజీలో బీబీఏ రెండో ఏడాది చదువుతున్నారు. గంజాయిని సేవించడంతో పాటు ఈజీ మనీ కోసం దానిని అమ్మేవారని గుర్తించారు. అరెస్టు చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గంజాయి దందాపై లోతుగా దర్యాప్తు చేపట్టారు.
మహిళలకు బైక్ రైడింగ్ పోటీలు
తుమకూరు: తుమకూరు దసరా ఉత్సవాల సందర్భంగా ఆదివారం మహిళా దసరా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బైక్ రైడింగ్ పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి రోడ్లపై దూసుకెళ్లారు. అంతకుముందు బైక్ రైడింగ్‌ను మంత్రి పరమేశ్వర్ ప్రారంభించారు. కలెక్టర్ శుభకళ్యాణ్, ఉప విభాగం అధికారి పాల్గొన్నారు.