
పండుగ వేళ.. వానల హోరు
యశవంతపుర: కన్నడనాట అనేక జిల్లాలలో నేటి నుంచి అక్టోబరు 4 వరకు భారీగా వానలు పడే అవకాశం ఉందని బెంగళూరు వాతావారణశాఖ ఆధికారులు తెలిపారు. ఈ కారణంగా కరావళి, మలెనాడు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు. ఈ నెల 30న తుపాన్‌గా ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒడిశా తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అలజడి వల్ల కర్ణాటకలో వారంరోజులు కుండపోత వానలు పడే ఆస్కారముంది. చేపలు పట్టడానికి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు తెలిపారు.
మరోవైపు బెంగళూరుతో పాటు ఽహావేరి, ధారవాడ, చిత్రదుర్గ, దావణగెరె, కోలార, రామనగర, మైసూరు, చామరాజనగర, శివమొగ్గ జిల్లాలో ఆదివారం నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి. కరావళి జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉంది. ఉత్తర కర్ణాటకలో బాగలకోట, బీదర్, గదగ్, కలబురగి, కొప్పళ, రాయచూరు, విజయపుర, దక్షిణకన్నడ, ఉడుపి, యాదగిరితో పాటు 8 జిల్లాలలో ఆరెంజ్ ఆలర్ట్‌ను ప్రకటించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే అక్కడ వానలు జోరందుకున్నాయి.
అత్యవసర చర్యలకు సీఎం ఆదేశం
ఉత్తర కర్ణాటకతో సహా రాష్ట్రంలో భారీ వానలు పడే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎం సిద్ధరామయ్య సూచించారు. మహారాష్ట్రలో కురుస్తున్న వానలతో కృష్ణా, భీమా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భీమా తీరంలో నదికి అటు ఇటు ఉన్న గ్రామాలలోకి వరదనీరు ప్రవేశించింది. వరద ప్రాంతాలలో మకాం వేసి సహాయక చర్యలను చేపట్టాలని, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఐఏఎస్‌లు పర్యటించాలని సీఎం ఆదేశించారు. కలబురగి జిల్లాలో అతివృష్టి నెలకొంది.
ఉత్తర జిల్లాల్లో అతలాకుతలం
కళ్యాణ కర్ణాటకలో కలబురగి, విజయపుర, బీదర్, రాయచూరు, కొప్పళలో భారీ వానల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నవరాత్రుల సమయంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వ్యాపారాలు స్తంభించిపోయాయి. చేతికి వచ్చిన పంట నీటి పాలయ్యే ప్రమాదం ఉందని అన్నదాతలు వాపోతున్నారు. వరద ప్రాంతాలలో సహాయక చర్యలను చేపట్టాలని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత తాలూకాలలో గంజి కేంద్రాలను తెరవాలి, అత్యవసర సౌకర్యాలను కల్పించాలని కోరారు.
బెళగావి బస్టాండు వద్ద జల్లువాన
ఉత్తర కర్ణాటక జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయ్యింది
అక్టోబర్ 4 వరకు భారీ వర్షసూచన
ఉత్తర కర్ణాటకకు ఆరెంజ్ అలర్ట్
ఇప్పటికే ముమ్మరంగా వానలు
పొంగిపొర్లుతున్న కృష్ణా, భీమా నదులు

పండుగ వేళ.. వానల హోరు