బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీ.. ముగ్గురు బలి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీ.. ముగ్గురు బలి

Sep 29 2025 8:28 AM | Updated on Sep 29 2025 8:28 AM

బైక్‌

బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీ.. ముగ్గురు బలి

దొడ్డబళ్లాపురం: బస్సు, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన సంఘటన హాసన్‌ జిల్లా హొళేనరసీపుర తాలూకా యడెగౌడనహళ్లిలో జరిగింది. మృతులను హొళేనరసీపుర పట్టణ నివాసులు తరుణ్‌ (19), రేవంత్‌ (26), ఇర్ఫాన్‌(20)లుగా గుర్తించారు. హాసన్‌ నుంచి మైసూరు వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సు.. ఘటనాస్థలిలో వేగంగా బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్ర గాయాలతో పడిపోయారు. ఇర్ఫాన్‌ అక్కడే చనిపోగా, రేవంత్‌, తరుణ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. హళ్లి మైసూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

రామకోటి మహాయజ్ఞం

చింతామణి: తాలూకాలో కై వారం గవి దగ్గర ప్రకృతి ఒడిలో ఉన్న యోగా నరసింహస్వామి వైకుంఠ యోగశాలలో రామభావతార మంత్ర రామకోటి జపయజ్ఞ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గోపూజతో ప్రారంభించారు. గణపతి, మహాలక్ష్మీ ,యోగానరసింహస్వామి, సద్గురు యోగినారేయణ తాతయ్య విగ్రహాలకు విశేష పూజలను నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రామకోటిని 24 గంటలపాటు చేపట్టారు. కై వార ధర్మాధికారి జయరాం దంపతులు, విభాకరరెడ్డి, సత్యనారాయణ, విద్వాన్‌ బాలకృష్ణ పాల్గొన్నారు.

నకిలీ పత్రాలతో బీడీఏ స్థలాలకు ఎసరు

దొడ్డబళ్లాపురం: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బీడీఏ స్థలాలను కబళిస్తున్న ముగ్గురు కిలాడీలను బెంగళూరు శేషాద్రిపురం పోలీసులు అరెస్టు చేశారు. కే.చిక్కరాయి (68), మురళీధర్‌ (60), మంజునాథ్‌ (48)అరైస్టెన నిందితులు. బీడీఏ నాడప్రభు కెంపేగౌడ కాలనీలో ఓ స్థల యజమాని మరణించారు. ఆ స్థలాన్ని వీరు నకిలీ పత్రాలతో వారి పేరున రిజిస్టర్‌ చేయించుకున్నారు. మృతుని భార్య లక్ష్మిదేవమ్మ స్థలం వద్దకు వెళ్లగా నీది కాదు అని దౌర్జన్యం చేశారు. దీంతో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. గతంలో బీడీఏలో పని చేసి రిటైరైన ఉద్యోగి కే చిక్కరాయి, మంజునాథ్‌, బ్రోకర్‌ మురళీధర్‌ ముగ్గురూ కలిసి బోగస్‌ డాక్యుమెంట్లు సృష్టించి మరో వ్యక్తిని స్థల యజమాని చూపి సైటును రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇదేమాదిరిగా అనేక సైట్లను బోగస్‌ పత్రాలతో సొంతం చేసుకుని విక్రయించినట్టు తేలింది. వీరిని అరెస్టు చేసిన పోలీసులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు.

మైసూరుకు బస్సు చార్జీల వాత

దొడ్డబళ్లాపురం: మైసూరు దసరా నేపథ్యంలో ప్రభుత్వం ప్రయాణికుల జేబుల్ని గుల్ల చేస్తోంది. కేఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ రేట్లను రూ.20 చొప్పున పెంచింది. దసరా ఉత్సవాలు ప్రజలందరూ చూడాలని చార్జీలను తగ్గించి ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా మైసూరుకు బస్సులో వెళ్తే రూ.20 అదనపు చార్జీని చెల్లించాలి. వేగదూత, ఐరావత, నాన్‌ స్టాప్‌, రాజహంస తదితర బస్సుల్లో కూడా ఇదే వర్తిస్తుంది. దసరా ఉత్సవాలు ముగిసే వరకూ చార్జీల బాదుడే.

బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీ.. ముగ్గురు బలి1
1/1

బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీ.. ముగ్గురు బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement