
ఖాకీలమంటూ రూ.1.1 కోట్లు దోపిడీ
దొడ్డబళ్లాపురం: దంపతులను, కారు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి రూ.1.1 కోట్లు దోచుకున్న 8 మంది దుండగులను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... శనివారం సాయంత్రం ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన వ్యాపారి మోహన్ తన కారుడ్రైవర్ హేమంత్‌కు ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారి మోటరామ్ వద్ద డబ్బును తీసుకురావాలని చెప్పాడు. ఆ మేరకు హేమంత్ హుళిమావు పీఎస్ పరిధిలోని అక్షయనగరకు వెళ్లి మోటరామ్‌కు ఫోన్ చేశాడు. కాసేపటికి అక్కడకు తన భార్యతో కలిసి కారులో వచ్చిన మోటరామ్ కారు వెనుక డబ్బు ఉందని తీసుకోవాలని చెప్పాడు. అయితే అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తాము పోలీసులమని, కారు చెక్ చేయాలని వీడియో తీస్తూ బెదిరించారు. దంపతులపై దాడి చేశారు. హేమంత్‌ను, మోటరామ్ దంపతులను బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసికెళ్లారు. అక్కడ మరో ఆరుగురు దుండగులు కలిసి వారిని బంధించారు.
మరో 10 లక్షలు పంపాలని ఫోన్
హేమంత్ చేత యజమాని మోహన్‌కు ఫోన్ చేయించి రూ.10 లక్షలు పంపించాలని, లేదంటే హేమంత్‌ను చంపేస్తామని బెదిరించారు. అందుకు మోహన్ ఒప్పుకోలేదు. వెంటనే హుళిమావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు గాలింపు జరిపి 15 నిమిషాల్లో దుండగులు ఉన్న స్థలాన్ని కనిపెట్టారు. 8 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.1.1 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ నగదును, స్వాధీనం చేసుకున్న 2 కార్లు, ఇతరత్రా సామగ్రిని పరిశీలించారు.
ముగ్గురి కిడ్నాప్...
పావుగంటలో పట్టేసిన పోలీసులు
బెంగళూరు హుళిమావులో ఘటన

ఖాకీలమంటూ రూ.1.1 కోట్లు దోపిడీ