
విదేశీ భాషల్లో నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ
బళ్లారిఅర్బన్: జిందాల్ సంస్థ ఆవరణలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు భవిష్యత్తులో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా జర్మన్, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేందుకు వివిధ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించి జిందాల్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు సునీల్ రాల్ఫ్ మాట్లాడుతూ వైద్య రంగంలో రాణించాలనుకొనే వారు మంచి సమాచార వారధులుగా ఎదిగేందుకు వివిధ భాషలు నేర్చుకోవడం అత్యవసరం అన్నారు. రకరకాల రోగులతో మాట్లాడేందుకు ఈ భాషలు నేర్చుకోవడం వల్ల ముఖ్యంగా ఆయా రోగుల మాతృభాషల్లో మాట్లాడితే వారికెంతో సంతృప్తి కలుగుతుందన్నారు. అందుకే నర్సు ఉద్యోగాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉండటం వల్ల జర్మన్, ఇంగ్లిష్ భాష నేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్నారు. ఆ భాషలను నేర్పించడానికి చార్కోస్ సంస్థ, ఇన్నోవేషన్ అన్ లిమిటెడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. పెద్దన్న బీదల, మహేష్ శెట్టి, సన్ని ఈయప్పన్, డాక్టర్ మంజునాథ్, రాగిణి, జిందాల్ నర్సింగ్ కళాశాల ప్రాధ్యాపకులు రాజేశ్వరి, శివరాజ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.