
రోడ్డు ప్రమాదంలో ఎలుగుబంటి మృతి
హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి తాలూకా కల్లాకుండి గ్రామం దగ్గర రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆడ ఎలుగుబంటి మృతి చెందింది. అడవి అంచున ఉన్న కలఘటిగి– హళియాళ రోడ్డులో ఉదయం వేళలో ఏదో వాహనం ఢీకొనడంతో ఎలుగుబంటి చనిపోయిందని ఆ స్థలాన్ని పరిశీలించిన జోన్ అటవీ శాఖ అధికారి అరుణ్‌కుమార్, పశువైద్యాధికారి దేవేంద్రప్ప లమాణి తెలిపారు. పోస్టుమార్టం చేయగా, దాని వయస్సు సుమారు 8 ఏళ్లు ఉంటుందని గుర్తించారు. ప్రమాదం వల్లే చనిపోయిందని జోన్ అటవీ శాఖ అధికారి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
గరగలో కర్ఫ్యూ ఆదేశాలు
మరో ఘటనలో ధార్వాడ గరగలో గత రెండు రోజుల నుంచి విధించిన కర్ఫ్యూ ఆదేశాలు బుధవారం సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. గరగలోని దుర్గమ్మదేవి మూర్తి ప్రతిష్టాపన సందర్భంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి ప్రదర్శనలు, కార్యక్రమాలను జరపరాదని తహసీల్దార్ డాక్టర్ బీహెచ్ హుగార్ ఆదేశాలను ఇచ్చినట్లు తెలిపారు.
ఇన్‌స్టాలో అశ్లీల పోస్టులు
హుబ్లీ: అశ్లీల వీడియోలు తీసి మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి యువతుల పేరున నకిలీ ఇన్‌స్టా ఖాతాలను తెరిచి అశ్లీల ఫోటోలతో పాటు వీడియోలను పోస్టు చేసేవాడు. దీనిపై కొందరు బాధిత యువతులు ఫిర్యాదు చేయడంతో నగరానికి చెందిన మంజునాథ హుటవలేపై కేసు నమోదు అయింది. నగరంలో 6 మంది యువతుల పేరిట నకిలీ ఇన్‌స్టా ఖాతాలు తెరిచి అశ్లీల ఫోటోలు, వీడియోలను పోస్టు చేసి వికృతానందం పొందేవాడు.
ఫ్లైయాష్‌ను రైళ్ల ద్వారా
రవాణా చేయాలి
రాయచూరు రూరల్: యరమరస్ ఽథర్మల్ విద్యుత్ కేంద్రం(వైటీపీఎస్) నుంచి విడుదలవుతున్న ఫ్లైయాష్‌ను రైలు వ్యాగన్ల ద్వారా రవాణా చేయాలని దళిత సేనా సమితి డిమాండ్ చేసింది. మంగళవారం వైటీపీఎస్ యూనిట్ల కేంద్ర కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకురాలు విజయ్ రాణి మాట్లాడారు. ఫ్లైయాష్‌ను ట్యాంకర్ లారీలతో రవాణా చేయకుండా దానిని రైలు వ్యాగన్ల ద్వారా రవాణా చేయడానికి చర్యలు చేపట్టాలని కోరుతూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
పౌరకార్మికుల సేవలు అనన్యం
హొసపేటె: నగరంలో పౌరకార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గవియప్ప తెలిపారు. మంగళవారం నగరసభ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర పౌర ఉద్యోగుల సంఘం, నగరసభ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌరకార్మికుల దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పౌరకార్మికులకు ఎలాంటి కుల మతాలు లేవన్నారు. నగర స్వచ్ఛతపై పౌర కార్మికులు దృష్టి పెట్టడం అభినందనీయమన్నారు. పౌరకార్మికులకు తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. వాటిని పౌరకార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పౌరకార్మికులకు తమ ప్రభుత్వం తరపున స్థలాలను అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న కులగణన సమీక్షకు నగర ప్రజలు సహకరించాలన్నారు. అనంతరం రిటైర్డ్ పౌరకార్మికులు, ఉత్తమ సేవలు అందించిన కార్మికులను సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి, ఎస్పీ జాహ్నవి, నగరసభ అధ్యక్షులు రూపేష్ కుమార్, ఉపాధ్యక్షులు రమేష్ గుప్తా, హుడా అధ్యక్షుడు హెచ్‌ఎన్.ఇమామ్, స్థాయి సమితి అధ్యక్షులు కిరణ్, నగరసభ కమిషనర్ ఎర్రగుడి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
యత్నాళ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కోలారు : బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే బసవ నగౌడ యత్నాళ్ దళిత మహిళలను అవహేళన చేశారని, ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కర్ణాటక దళిత సంఘర్ష సమితి మహిళా సభ్యులు డిమాండ్ చేశారు. నగరంలోని ఆ సమితి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. దళిత మహిళలు చాముండేశ్వరి దేవికి పూలమాల వేయరాదని ప్రచారం చేస్తున్నారన్నారు. బసవనగౌడ యత్నాళ్‌పై కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈసందర్భంగా జిల్లా సమితి సంచాలకురాలు లక్ష్మి, తాలూకా సంచాలకురాలు బేతమంగల పద్మ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఎలుగుబంటి మృతి