
సమయాన్ని వృథా చేసుకోవద్దు
సాక్షి బళ్లారి: పీయూసీ అనంతరం ఇంజినీరింగ్‌లో, ఏదైనా డిగ్రీని అభ్యసించే విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదువుతూ ఉత్తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని రావ్‌బహుదూర్ మహాబలేశ్వరప్ప ఇంజినీరింగ్(ఆర్‌వైఎంఈసీ) కళాశాల చైర్మన్ జానెకుంటె బసవరాజు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆర్‌వైఎంఈసీలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కళాశాలల్లో అడుగుపెట్టిన విద్యార్థులకు సీనియర్ విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం, సిబ్బంది ఘన స్వాగతం పలికి విద్యార్థులకు హితోపదేశం చేశారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇంజినీరింగ్‌లో చేరాం, తమకు అన్నీ సమకూరతాయని అనుకుంటే పొరపాటేనన్నారు. ఈ నాలుగేళ్ల పాటు ఆయా రంగాల్లో రాణించేందుకు సాంకేతికతతో కూడిన నైపుణ్యాన్ని అలవర్చుకొని చక్కటి భవిష్యత్తుకు మంచి నడత, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఇంజినీరింగ్ పూర్తి చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తుంటారన్నారు. కుటుంబ పరిస్థితులను గుర్తెరిగి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రిన్సిపాల్ హనుమంతరెడ్డి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ భవిష్యత్తును రూపుదిద్దుకోండి
తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చండి
విద్యార్థులకు ఆర్‌వైఎంఈసీ చైర్మన్ జానెకుంటె బసవరాజు పిలుపు