
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకాలో అక్రమంగా లారీలో తరలిస్తున్న బియ్యం బస్తాలను సోమవారం రాత్రి పట్టుకున్నారు. ఆహార పౌర సరఫరాల శాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో శ్రీపురం జంక్షన్ వద్ద 300 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్న లారీని అధికారులు జప్తు చేశారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.6.60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన సతీష్ ఆదోని, లారీ డ్రైవర్ మహ్మద్ అఫ్తాబ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు గ్రామీణ ప్రాంతాల్లో కేజీ బియ్యాన్ని రూ.15 చొప్పున కొనుగోలు చేసి అక్రమంగా మిల్లింగ్‌కు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అధికారులు దాడి జరిపి స్వాధీనం చేసుకున్నారు.
ఆరోగ్య శిబిరాల
లబ్ధి పొందండి
హొసపేటె: ఇంట్లో తయారు చేసిన ఆహారం తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు నైమిషా తెలిపారు. నగరంలో ఉచిత ఆరోగ్య తనిఖీ, రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యాధుల నుంచి విముక్తి పొందాలంటే ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేహెచ్.గురుబసవరాజ్, ఆయుష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేదారేశ్వర్ దండిన్, వైద్యాధికారులు మునివాసుదేవరెడ్డి, ప్రసాద్‌బాబు, శైలేంద్ర ప్రతాప్‌సింగ్, రాధా గురుబసవరాజ్, చేతన్, సికందర్, హాలమ్మ, చంద్రశేఖర్ శెట్టి, బళగానూరు మంజునాథ్, సరస్వతి కోటె, హేమలత, రూప్‌సింగ్ రాథోడ్, శివశరణయ్య, ఆర్తి హిరేమట్, అశోక్, మంజునాథ్ హనసి, యశ్వరాజ్‌నాథ్ హన్సీ, రోటరీ బ్లడ్ బ్యాంక్, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా మహా శరణి సత్యక్క జయంతి
సిరుగుప్ప: నగరంలో మంగళవారం నగరసభ పౌర కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మహా శరణి సత్యక్క చిత్రపటానికి పూజలు చేసి, ప్రముఖ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి ఘనంగా జయంతిని ఆచరించారు. ఈ సందర్భంగా సంఘం పదాధికారులు, పౌరకార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
ఇంటి వైద్యంతో ఆరోగ్యం
రాయచూరు రూరల్: మనిషికి వస్తున్న వ్యాధుల అడ్డుకట్టకు తోడు ఆరోగ్యానికి ఇంటి వైద్యం ప్రధానమని నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ అన్నారు. మంగళవారం ఆయుష్ ఆరోగ్య శాఖ కార్యాలయంలో 10వ ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిని ఆమె పూలమాల వేసి ప్రారంభించి మాట్లాడారు. ఆయుర్వేద వైద్యం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదన్నారు. ఇంటిలో లభించే వంటింటి వస్తువులు మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయన్నారు. జిల్లా ఆయుర్వేద అధికారి శంకర్‌గౌడ, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, చంద్రశేఖర్, ప్రతిమ, నిర్మల హుల్లూరు, దుర్గేష్, ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు.
లడ్డూ ప్రసాదం
పంపిణీ ప్రారంభం
కోలారు: నగర దేవత కోలారమ్మ ఆలయంలో లడ్డూ ప్రసాదం పంపిణీని జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.రవి మంగళవారం ప్రారంభించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో కోలారమ్మకు విశేష పూజలు నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగా భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీని ప్రారంభించినట్లు తెలిపారు. నగరంలోని పురాతన సోమేశ్వర ఆలయం, సీతి భైరవేశ్వర స్వామి ఆలయాల్లోనూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందిస్తున్నట్లు తెలిపారు.

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత