
ఒక్క కాన్పులో ముగ్గురు శిశువులు
యశవంతపుర: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మినిచ్చిన అనూహ్య సంఘటన హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా కాడనూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. ఓ గర్భిణి (29) ప్రసవానికి సమయం రావడంతో స్థానిక హిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గైనకాలజిస్టు డాక్టర్ న్యాన్సి పౌల్ మార్గదర్శనంలో వైద్య సిబ్బంది సిజేరియన్ ప్రసవం చేశారు. ముగ్గురు పిల్లలు పుట్టారు. మొదట జన్మించిన మగశిశువు 2.1 కేజీలు, తరువాత పుట్టిన ఆడ శిశువు 1.9 కేజీలు, మరో ఆడపాప 1.8 కేజీలున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు ఇదే మొదటి కాన్పు అని, ఒకే ప్రసవంలో ముగ్గురు జన్మించటం అపురూపమని తెలిపారు. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు.